Saturday, November 23, 2024

Big story : దీపావళీ నుంచి జియో 5జీ సేవలు.. వచ్చే డిసెంబర్‌ నాటికి దేశమంతా విస్తరణ

రిలయన్స్‌ వార్షిక జనరల్‌ బాడీ సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ పలు కీలక అంశాలను ప్రకటించారు. బిజినెస్‌ వారసులను ప్రకటించారు. వారికి కీలక వ్యాపార భాద్యతలు అప్పగించారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు వివరించారు.
ముఖ్‌ అంబానీ పెద్ద కొడుకు అకాశ్‌ అంబానీకి టెలికమ్‌ బిజినెస్‌ను, చిన్న కొడుకు అనంత్‌ అంబానీకి న్యూ ఎనర్జీ బిజినెస్‌, కూతురు ఇషా రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌ వ్యవహారాలు చూస్తారని ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.

5జీ కోసం భారీ పెట్టుబడులు

రిలయన్స్‌ జియో 5జీ సర్వీస్‌లను దీపావళి నాటికి అన్ని మోట్రో నగరాల్లో ప్రారంభిస్తామని ఏజీఎంలో ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. 2023 డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. దీపావళి నాటికి ముందుగా ముంబై, ఢిల్లి, చెన్నయ్‌, కోల్‌కతా నగరాల్లో 5జీ సేవలను అందుబాటులో తీసుకు వస్తారు. 5జీ సేవల అభివృద్ధికి 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు రిలయన్స్‌ కట్టుబడి ఉందన్నారు. ప్రతి నెల ఈ సేవలను విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన 5జీ వేలంలో 88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. 5జీ సొల్యూషన్స్‌ కోసం క్వాల్‌కామ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. 5జీ స్మార్ట్‌ఫోన్‌, గూగుల్‌ క్లౌడ్‌ కోసం గూగుల్‌తో కలిసి పని చేయనున్నట్లు వివరించారు.

ఫైబర్‌ నెట్‌వర్క్‌లోనూ జియో ముందు వరసలో ఉందని అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా జియో ఫైబర్‌కు 11 లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ ఆఫ్టికల్‌ నెట్‌వర్క్‌ ఉందని ముఖేష్‌ అంబానీ చెప్పారు. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశం ఇంకా వెనుకబడే ఉందన్నారు. అంతర్జాతీయంగా మన దేశంలో ఈ విషయంలో 138వ ర్యాంక్‌లో ఉందని, దేశాన్ని టాప్‌ 10లో నిలపడమే లక్ష్యమని చెప్పారు.

ఓ2సీ బిజినెస్‌లో 75 వేల కోట్ల పెట్టుబడులు

- Advertisement -

వార్షిక జనరల్‌ బాడీ సమావేశంలో ముఖేష్‌ అంబానీ పలు కీలక ప్రకనలు చేశారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు వివరించారు. ఆయిల్‌ టూ కెమికల్‌ బిజినెస్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఆయిల్‌ అండ్‌ కెమికల్‌ విభాగం(ఓ2సీ) ఆదాయం 5 లక్షల కోట్లు దాటిందని చెప్పారు. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ విభాగంలో 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దహేజ్‌లో ఏఆ 3 ఎంఎంటీపీఏ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్‌ ట్రెయిన్‌ పీటీఏ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో 1 ఎంఎంటీపీఏ ప్లాంట్‌ను 2026 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యూఏఈలోనూ కొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విస్తరణతో పీవీసీ రంగంలో రిలయన్స్‌ ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. హజీరాలో భారత్‌లోనే తొలి కార్బన్‌ ఫైబర్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. పాలిస్టర్‌, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ సామర్ధ్యాన్ని ఏటా 5 బిలియన్‌ బాటిళ్లకు పెంచనున్నట్లు తెలిపారు.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌లో పెరిగిన ఉత్పత్తి

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వ్యాపారం వృద్ధి పథంలో ఉందని ముఖేష్‌ అంబానీ వివరించారు. గత సంవత్సరం వ్యవధిలో ఉత్పత్తి 9 రేట్లు పెరిగినట్లు తెలిపారు. ఈ బిజినెస్‌లో ఆదాయం 1 బిలియన్‌ డాలర్లు దాటిందన్నారు. 2022 చివరి నాటికి ఎంజీ ఫీల్డ్‌, కేజీ డీ6ను అమల్లోకి తీసుకు రావడంతో దేశ గ్యాస్‌ ఉత్పత్తిలో రిలయన్స్‌ వాటా 30 శాతాని కి చేరుతుందన్నారు. రిలయన్స్‌ సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా ప్రయాణం ప్రారంభించిందని ముఖేష్‌ అంబానీ తెలిపారు. శిలాజ ఇంధనాల స్థానంలో పునరుత్వాదక ఇంధన వనరుల ఉపయోగాన్ని మొదలు పెట్టినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున హరిత ఇంధన ఉత్పత్తికి బయోమాస్‌ ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. దహేజ్‌, హజీరాలోని కంపెనీ తయారీ కేంద్రాల్లో సంప్రదాయ ఇంధనాల స్థానంలో హరిత ఇంధనం, స్టీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్‌ వ్యాపారాలను వచ్చే జనరేషన్‌ విజయవంతంగా ముందుకు తీసుకుపోతారన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. రిలయన్స్‌ జియోకు ఇప్పటికే అకాశ్‌ అంబానీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

కొత్తగా ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌

రిలయన్స్‌ రిటైల్‌ విభాగానికి కూతురు ఈషా అంబానీ నాయకత్వం వహిస్తారని జనరల్‌ బాడీ సమావేశంలో ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. సమావేశంలో రిలయన్స్‌ రిటైల్‌ బిజినెస్‌ విస్తరణ ప్రణాళికలను ఆమే స్వయంగా వివరించారు. కంపెనీ కొత్తగా ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎంసీజీ) బిజినెస్‌లోకి ఈ సంవత్సరమే ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి నిత్యావసరాలను చేరువ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు చేసే నాణ్యమైన వస్తువులను మార్కెటింగ్‌ చేస్తామని ఈషా తెలిపారు. ప్రతి భారతీయుడి అవసరాలకు అనుగుణంగా అత్యున్న నాణ్యమైన వస్తువులను అందిస్తామని చెప్పారు.

జియో ఎయిర్‌ఫైబర్‌ హాట్‌స్పాట్‌

సమావేశంలో రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ అకాశ్‌ అంబానీ కంపెనీ ప్రణాళికలను వివరించారు. రిలయన్స్‌ జియో ఎయిర్‌ ఫైబర్‌, వైఫై హాట్‌స్పాట్‌ను ఆయన ప్రకటించారు. కార్యాలయాలు, ఇళ్లలో ఇంటర్‌నెట్‌ ఉపయోగించే కస్టమర్లకు ఫైబర్‌ లాంటి స్పీడ్‌ను ఇది అందిస్తుందని చెప్పారు. ఎలాంటి వైర్లు లేకుండానే ఇళ్లలోనూ, ఆఫీస్‌ల్లోనూ ఒకే డివైస్‌తో ఒక గిగాబైట్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ను అందిస్తుందని వివరించారు. అతి తక్కువ సమయంలోనే తాము ప్రతి ఇంటికి, కార్యాలయానికి ఆల్ట్రా హై స్పీడ్‌ బ్రాడ్‌బాండ్‌ సేవలను అందిస్తామన్నారు. దీని వల్ల ఇంటర్‌నెట్‌, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బాండ్‌తో సహా మన దేశంలో టాప్‌ 10లో ఉంటుందని చెప్పారు.

పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ కోసం గిగా ఫ్యాక్టరీ

గ్రీన్‌ ఎనర్జీని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ డి జైన్‌ తయారీ సామర్ధ్యాలను పెంచనున్నట్లు తెలిపారు. ఇందు కోసం ప్రముఖ కంపెనీలతో జతకట్టనున్నట్లు తెలిపారు. 2023 నాటికి రిలయన్స్‌ బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2024 నాటికి సంవత్సరానికి 5 గిగావాట్‌ సామర్ధ్యంతో పూర్తిస్థాయి బ్యాటరీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. దీన్ని 2027 నాటికి 50 గిగావాట్‌ సామర్ధ్యానికి పెంచనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం జామ్‌నగర్‌లో ధీరూభాయ్‌ అంబానీ గీన్‌ ఎనర్జీ గిగా కంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు రిలయన్స్‌ ప్రకటించింది. గ్రే ఎనర్జీని 2025 నాటికి గ్రీన్‌ హైడ్రోజన్‌గా మార్చనున్నారు. 2022 ఆగస్టు 15న జామ్‌నగర్‌లో బైయో ఎనర్జీ ప్లాంట్‌ మొదటి దశను ప్రారంభించారు.
వాట్స్‌యాప్‌తో జియోమార్ట్ కిరణా సరుకులు కొనుగోలు కోసం ఇక నుంచి వాట్స్‌యాప్‌ ద్వారా రిలయన్స్‌ జియోమార్ట్‌ నుంచి సరుకులు , ఇతర గృహ అవసరాలను కొనుగోలు చేయవచ్చని రిటైల్‌ బిజినెస్‌ బాధ్యతలు చూస్తున్న ఈషా అంబానీ సమావేశంలో వివరించారు. ఈ మేరకు వాట్స్‌యాప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. జియోలో 2020లో వాట్స్‌ యాప్‌ మాతృ సంస్థ మీటా 6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

మన దేశం స్థిరంగా అభివృద్ధి చెందుతుందని ముఖేష్‌ అంబానీ చెప్పారు. కరోనాను ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని, ఆర్థిక రంగంలోనూ ఎదురవుతున్న సవాళ్లను అధిగమించిందన్నారు. ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం, ఇందుకోసం 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ బిజినెస్‌లో 75 వేల కోట్ల పెట్టుబడులు వ్యాపారంలో నేరుగా అదానీతో ఢీకొట్టేందుకే అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీ నికర విలువను పెంచుకునేందుకు కొత్తగా ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌లోకి, న్యూ ఎనర్జీ బిజినెస్‌లోకి రిలయన్స్‌ ప్రవేశించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement