పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను మళ్లించిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించి నాలుగు కేసుల్లో లాలూకు శిక్ష ఖరారైంది. ఇందులో మూడింటికి ఇప్పటికే బెయిల్ లభించింది. తాజా బెయిల్‌తో.. జైలు నుంచి విడుదలయ్యేందుకు లాలూకు మార్గం సుగమమైంది.
కాగా, గతంలో బీహార్‌లో భాగంగా ఉన్న జార్ఖండ్ నగర ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమంగా తీసుకున్నారనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. దుమ్‌కా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలుశిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. దాణా కుంభకోణంలో భాగమైన నాలుగు కేసుల్లో.. మూడింటిలో ఆయనకు బెయిల్ గతంలోనే మంజూరు అయ్యింది. ఇక దమ్‌కా కేసులో కూడా బెయిల్ రావడంతో త్వరలోనే లాలూ ఇంటికి వెళ్లనున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పూర్తి అయితే.. పట్నాకు వెళ్లే అవకాశం ఉంది.