జార్ఖండ్ లో బిజెపికి జైలు దెబ్బ
హేమంత్ అధికారంలో ఉండగా బొగ్గు స్కామ్ లో అరెస్ట్
ఈ ఎన్నికలలో ప్రచార అస్త్రం చేసుకున్న ఝార్ఖండ్ ముక్తీ మోర్చా
కాంగ్రెస్, ఆర్జేడీతో జత కట్టిన జె ఎం ఎం
57 స్థానాలలో ఇండియా కూటమి పాగా
కేవలం 23 లోపు స్థానాలకే బిజెపి కూటమి పరిమితం
మరోసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టనున్న హేమంత్ సోరేన్
రాంచీ – మహారాష్ట్రలో అప్రతివిజయం సాధించిన బిజెపి కూటమికి జార్ఖండ్ లో మాత్రం బ్రేకులు పడ్డాయి.. జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో అధికార ఇండియా కూటమి దూసుకుపోతోంది. . జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తాజా సమాచారం మేరకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన ఇండియా కూటమి 57 కి పైగా సీట్లను సాధించనుంది. ఇందులో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ఒక్కటే 35 సీట్లు సాధించింది. ఈ కూటమిలోని కాంగ్రెస్ కు 16 సీట్లు దక్కగా, మరో ఆరు స్థానాలు ఈ కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నాయి . ఇక విపక్ష బీజేపీ కూటమి 23 సీట్లలో గెలవనుంది. వాటిలో బిజెపి 20 స్థానాలలో గెలుపు బాటలో ఉండగా, దాని మిత్రపక్షాలైన ఏజేఎస్‌యూ , జేడీయూ , లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీలు ఒక్కో స్థానం కైవసం చేసుకోనున్నాయి.
మొత్తం 81 స్థానాలున్న ఈ అసెంబ్లీలో అధికార పీఠం దక్కాలంటే 41 సీట్ల అవసరం.. ఈ మార్క్ ను ఇండియా కూటమి దాటేసింది. ప్రస్తత ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి.
ఆరోపణలున్నా…హేమంత్ కే పట్టం
గతేడాది వరకూ ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొన్న సీఎం హేమంత్ సోరెన్ ఇప్పుడు తాజా ఫలితాలతో మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ రెండు పరిణామాల మధ్య ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. హేమంత్ సోరెన్, ఆయన పార్టీ జేఎఎం సాధిస్తున్న విజయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఇంతలా జేఎంఎం పుంజుకోవడం వెనుక ఏం జరిగిందో ఓసారి చూస్తే…
బోగ్గు స్కామ్ లో హేమంత్ అరెస్ట్..
ఈ ఏడాది జనవరి 31న జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ బొగ్గు క్షేత్రాన్ని తనకు తాను కేటాయించుకున్న కేసులో ఢిల్లీలో అరెస్టు చేసి జైలుకు పంపింది. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి బాబాయ్ వరసైన చంపై సోరెన్ కు పగ్గాలు అప్పగించారు. సరిగ్గా ఆరు నెలల తర్వాత జూన్ లో హేమంత్ సోరన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తిరిగి సీఎంగా పగ్గాలు స్వీకరించారు. ఈ ఆరు నెలల్లో హేమంత్ భార్య కల్పనా సోరెన్ రాష్ట్రమంతా తిరిగి సానుభూతి పోగేశారు. తన భర్తను అకారణంగా అరెస్ట్ చేశారంటూ బిజెపిని ఎండగట్టారు అమె. దీంతో జేఎంఎంకు భారీ గెలుపు లభించింది. బీజేపీకి ఓటమినీ మిగిల్చింది.
చంద్రబాబు అరెస్ట్ తో
గతేడాది ఇదే తరహాలో ఏపీ స్కిల్ స్కాం కేసులో అప్పటి విపక్ష నేత చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టింది. దీంతో చంద్రబాబు, పవన్, బీజేపీ జట్టు కట్టి జగన్ ను గత ఎన్నికల్లో ముంచేశారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టు ద్వారా జగన్ ఎంత పెద్ద తప్పిదం చేశారో తెలియడానికి ఎంతోకాలం పట్టలేదు. ఇప్పుడు జార్ఖండ్ లోనూ సోరెన్ అరెస్టు బీజేపీకి అలాంటి షాకే ఇచ్చింది. అంతిమంగా చంద్రబాబు ఎపిసోడ్ జార్ఖండ్ లో రిపీట్ అయినట్లయింది.