జార్ఖండ్‌లోని లాతేహార్‌లో రాంచీ-ససారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.