మొదటి దశలో 43 స్థానాలకు ఎన్నికలు
మొత్తం 81 అసెంబ్లీ సీట్లు
తొలి దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 1.37 కోట్ల మంది
పోటీలో 683 మంది అభ్యర్ధులు
ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు
జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి
స్థానిక పార్టీల పొత్తుతో బరిలోకి దిగిన బేజీపీ
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సీఎం
ఆంధ్రప్రభ స్మార్ట్, జార్ఖండ్:
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 81అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ బుధవారం జరుగుతోంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు కేందాల వద్ద బారులు తీరారు. నక్సల్ ప్రభావిత ప్రాతం కావడంతో భారీగా భద్రతా బలగాలను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. ఇక మొదటి దశలో 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 683 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి కొన్ని స్థానాలకు సాయంత్రం నాలుగు గంటల వరకు, మరికొన్నింట అయిదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 70 శాతం మందికి పైగా నేడు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.
గిరిపుత్రులు ఎటు వైపు..
తొలి దశ పోలింగ్ జరగనున్న అన్ని స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ఈ 43 స్థానాల్లో 25 స్థానాలను జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలుచుకోగా, బీజేపీ కేవలం 13 స్థానాలను, స్వతంత్రులు రెండు స్థానాలను, ఎన్సీపీ ఒక్క సీటును, జేవీఎం ఒక్క సీటు దక్కించుకున్నాయి. 43 నియోజవకర్గాల్లో 20 ఎస్టీ రిజర్వుడ్, ఆరు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వీటిల్లో 18 స్థానాలను కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమే దక్కించుకోగా, రెండింటిని మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలపై ఇండియా కూటమి భారీగా ఆశలు పెట్టుకుంది. సీఎం హేమంత్ సొరేన్ అరెస్టుపై సానుభూతి కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. సొరేన్ సైతం ప్రధానంగా ఎస్టీల హక్కులనే ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. బీజేపీ కూడా గిరిజన ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించింది.
బరిలో ఇద్దరు మాజీ సీఎంల భార్యలు
తొలి దశ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంపయీ సొరేన్తో పాటు ఆరుగురు మంత్రులు, పలువురు కీలక నేతలు రంగంలో ఉన్నారు. నెల క్రితం జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన చంపయీ సొరేన్ మరోసారి సరైకెల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1991 నుంచి ఆయన ఇదే స్థానం నుంచి ఆరుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయనపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిన గణేశ్ మహలి ఈసారి జేఎంఎం నుంచి పోటీ చేస్తుండటంతో ఈ నియోజవకర్గంలో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రాంచి, జంషేడ్‌పూర్ పశ్చిమ, తూర్పు, జగన్నాథ్‌పూర్, లొహర్దగ, గర్హ్వా, చైబాసా, లతేహర్, పోట్క వంటి స్థానాలూ కీలకంగా మారాయి. జగన్నాథ్‌పూర్ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య గీతా కోడా, పోట్ల నుంచి మరో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంలో ఈ స్థానాలపై ఆసక్తి నెలకొన్నది.