కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ రోజు (ఆదివారం) జరిగిన 67 కిలోల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో 19 ఏళ్ల జెరెమి లాల్‌రిన్నుంగా స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. దీంతో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటివరకు రెండు స్వర్ణాలు (మీరాబాయి చాను, జెరెమి), రెండు రజతాలు (సంకేత్ సర్గర్, బింద్యారాణి), ఒక కాంస్యం (గురురాజా పూజారి) సాధించారు. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మూడోరోజు, ఆదివారం భారత క్రీడాకారులు దూసుకువెడుతున్నారు. బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు.
సరికొత్త రికార్డు సృష్టించిన జెరెమి..
ఈ రోజు (ఆదివారం) జరిగిన 67 కిలోల పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడారుడు జెరెమి స్వర్ణ పతకంతో సంచలనం సృష్టించాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో మొత్తం 160 కిలోలు, స్నాచ్‌లో 140 కిలోల బరువెత్తాడు. మొత్తంమీద ఈ పోటీలో జెరెమి ఏకంగా 300 కిలోల బరువెత్తినట్టయ్యింది. స్నాచ్‌లో140 కిలోల బరువెత్తి కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. చివరి ప్రయత్నంగా 165 కిలోల బరువెత్తేందుకు విఫలయత్నం చేసిన జెరెమి స్వల్పంగా గాయపడ్డాడు. అయినప్పటికీ స్వర్ణ పతకం సాధించేటప్పుడు ఉత్సాహంగా కన్పించాడు. ఈశాన్య రాష్ట్రం మిజోరంలోని ఐజ్వాల్‌కు చెందిన 19 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడు ఓ సంచలనంగా మారాడు. 2018 యువజన ఒలింపిక్ క్రీడల్లో 62 కిలోల పురుషుల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన జెరెమి కామన్వెల్త్ చాంపియన్ షిప్ పోటీల్లో 67 కిలోల విభాగంలోనూ స్వర్ణం సాధించాడు. ఇక, ఆదివారం నాటి పోటీలో సమావోకు చెందిన సీనియర్ వెయిట్ లిఫ్టర్ క్లీన్ అండ్ జర్క్, స్నాచ్ కేటగిరీల్లో 293 కిలోల బరువెత్తి రజత పతకం సాధించగా, నైజీరియాకు చెందిన ఎడిడియాంగ్ ఉమోవాఫియా 290 కిలోల బరువెత్తి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
బాక్సింగ్ నుంచి వెయిట్ లిఫ్టర్‌గా…
జెరెమి తండ్రి లాల్‌నీహులువాంగా జాతీయ స్థాయి బాక్సర్. తండ్రి బాటలో బాక్సింగ్ క్రీడపై మక్కువ పెంచుకున్న జెరెమి లాల్‌రిన్నుంగా కొంతకాలం పాటు శిక్షణ పొందాడు. కానీ వెయిట్ లిఫ్టింగ్‌లో ఏదో మజా ఉందని భావించి అటువైపు మళ్లాడు. 2011నుంచి దీక్షగా వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మోకాలి గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైన జెరిమి కోలుకున్నా మరింత కసితో శిక్షణ పొంది చవరకు తన కలం నిజం చేసుకున్నాడు. బర్మింగ్‌హామ్‌లో విజేతలకు ఇచ్చే బంగారు పతకం నమూనా తన స్మార్ట్‌ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకుని స్ఫూర్తి పొందాడు. చివరకు అనుకున్న స్వర్ణ పతకాన్ని సాధించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.