దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి..సోమవారం ఉదయం తుది కీని విడుదల చేసిన ఎన్టీఏ తాజాగా ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మరోవైపు, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్టీఏ ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటించనుంది. వీరిలో టాప్ 2.2లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.