హైదరాబాద్, ఆంధ్రప్రభ : జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై 30వ తేదీ వరకు జరగాల్సి ఉంది. తాజాగా ఈ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చింది. ఈనెల 25 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే పరీక్షల వాయిదాకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలకు జాతీయ స్థాయిలో 517 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 6.29 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపింది. హాల్ టికెట్లను గురువారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను జులై 12న ప్రకటించింది.
అగ్రి, ఫార్మసీ పరీక్షకు తాజా హాల్ టికెట్లు
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ జేఎన్‌టీయూ ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్న ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్షకు కొత్త హాల్ టికెట్లను జారీ చేస్తామని పరీక్ష కన్వీనర్, జేఎన్‌టీయూ సీనియర్ ప్రొఫెసర్ ఆచార్య గోవర్దన్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఈ హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ తాజా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని కోరారు. ఈనెల 14, 15 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా 30, 31వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. ఈ రెండు రోజుల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.