నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రత్నప్రభపై రిటర్నింగ్ అధికారికి జనతాదళ్ (యు) నేత ఏవీ రమణ ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో తనపై ఏ కేసు లేదని రత్నప్రభ పేర్కొన్నారు. అయితే బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుపాడు పోలీస్‌స్టేషన్లలో రత్నప్రభపై అయిదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రమణ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను అధికారికి సమర్పించారు. కుల ధృవీకరణ పత్రాలకు రికార్డులు లేవని, స్కిల్ డెవలెప్‌మెంట్ ఛైర్మన్‌గా పనిచేస్తూ, పెన్షన్‌పై జీవిస్తున్నట్టు తెలిపారని ఆరోపించారు. రత్నప్రభ నామినేషన్‌ను వెంటనే తిరస్కరించాలని రమణ డిమాండ్ చేశారు.
అటు తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రత్నప్రభ అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. గతంలో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆమె… తనకు రూ. 25 కోట్ల విలువైన ఆస్తి (భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి) ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ. 3.5 కోట్లుగా పేర్కొన్నారు. రూ. 52 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ తనకు ఆస్తులు లేవని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ తనకు రూ. 10 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తనకు రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్టు తెలిపారు. ఈ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.