వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రధానమంత్రికి లేఖ రాశారు. దేశంలోని ఏ స్టీల్ ప్లాంటుకు లేని ప్రత్యేకతలు వైజాగ్ ప్లాంటుకు ఉన్నాయన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ప్లాంటులో చిన్నచిన్న మార్పులు చేస్తే తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ప్లాంటును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి కొంత కాలం తర్వాత తప్పకుండా మార్పులకు నాంది పలకాల్సిన అవసరం ఉంటుందని… అయితే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే దానికి పరిష్కారం కాదని చెప్పారు.
స్టీల్ ప్లాంటులను ప్రైవేటీకరిస్తే, సిమెంటు రంగానికి పట్టిన గతే పడుతుందన్న జేడీ.. రేపటి రోజున స్టీల్ కొనడం కష్టంగా మారుతుందని అన్నారు. సర్దార్ పటేల్ విగ్రహానికి అవసరమైన 3,200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2,200 టన్నుల స్టీలును విశాఖ కర్మాగారం నుంచే పంపారని చెప్పారు. మిగిలిన స్టీల్ కంటే విశాఖ స్టీల్ నాణ్యమైనదని తెలిపారు. ఇతర స్టీల్ ప్లాంటులకు లేని ప్రత్యేకత వైజాగ్ స్టీల్ కు ఉందని… సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇదేనని చెప్పారు. ఎగుమతులు, దిగుమతులకు అనువైన ప్రాంతం వైజాగ్ అని అన్నారు.