ముంబైపై ఉగ్రదాడి జరిగిందని..సెప్టెంబర్ 26దాడులకు చెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని కవి, రచయిత జావెద్ అక్తర్ తీవ్ర విమర్శలు చేశారు. లాహోర్‌లో జరిగిన ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. ఆ దేశ వైఖరిని తప్పుపట్టారు. భారత్‌పై ద్వేషాన్ని వెదజల్లడం సరికాదు అని జావెద్ అక్తర్ తెలిపారు. ఉర్దూ భాష కవి ఫయిజ్ అహ్మాద్ ఫయిజ్ జ్ఞాపకార్ద వేడుకల్లో జావెద్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఆర్టిస్టులకు పాక్‌లో గౌరవం దక్కలేదని, కానీ ఇండియాలో మాత్రం పాక్ కళాకారులు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఫయాజ్ సాహెబ్ వచ్చినప్పుడు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, అంతటా బ్రాడ్‌కాస్ట్ చేశామని, నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహిదీ అసన్ వచ్చినప్పుడు ఫంక్షన్ చేశామని, కానీ మీరెప్పుడు లతా మంగేష్కర్‌కు గౌరవ సభ ఏర్పాటు చేయలేదని జావెద్ అన్నారు.
అక్తర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు స్వాగతిస్తున్నారు.రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం తగ్గాలని ఆయన సూచన చేశారు. దీనికి ఇండియాను నిందించడం సరికాదన్నారు. పాక్‌లో మంచి వాళ్లు ఉన్నారని, వాళ్లు బాంబులు వేయడం లేదని, పూలమాలలు వేస్తున్నారని, దీనికి మీరేమంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఒకరిపై ఒకరు నిందలు చేసుకోవడం సరికాదన్నారు. దాని వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చాలని, తాను ముంబైకి చెందినవాడినని, సిటీపై దాడి జరగడం చూశానని, వాళ్లేమీ నార్వేనో లేక ఈజిప్టు నుంచి రాలేదని, కానీ వాళ్లు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అందుకే భారతీయుల గుండెల్లో కోపం ఉందని, దానిపై ఫిర్యాదులు అవసరం లేదని జావెద్ అన్నారు.