Friday, November 22, 2024

భార‌త్ కు జ‌పాన్ షాక్.. సెమీస్ లో ఓట‌మి..

ఆసియా ఛాంపియన్స్‌ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌కు.. జపాన్‌ షాక్‌ ఇచ్చింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న మన్‌ ప్రీత్‌సేన సెమీస్‌పోరులో ఓటమిపాలైంది. జపాన్‌ చేతిలో 3-5 తేడాతో పరాజయం పాలైంది. ఆదినుంచి సెమీస్‌ పోరులో జపాన్‌ ఆధిపత్యం చెలాయించి భారత్‌ను కోలుకోనివ్వలేదు. దీంతో ఫైనల్‌ చేరకుండానే భారత్‌ పోరు ముగిసింది. కాంస్యపతకం కోసం చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్‌ పోరాడనుంది. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో భారత్‌ 6-0 తేడాతో జపాన్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి అర్ధభాగం ఆట పూర్తయ్యేసరికి భారత్‌ 1-3 తేడాతో వెనుకపడింది. అనంతరం జపాన్‌ మరో 2గోల్స్‌ సాధించి 5గోల్స్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. పుంజుకున్న భారత్‌ 3గోల్స్‌ సాధించి జపాన్‌ ఆధిపత్యాన్ని తగ్గించినా ఓటమిని తప్పించుకోలేకపోయింది.

ఆట ఆరంభంలోనే జపాన్‌కు లభించిన పెనాల్టి కార్నర్‌ను షోటా యమడా గోల్‌గా మలిచాడు. అనంతరం ఫుజిషిమా రెండో నిమిషంలో గోల్ చేయగా, 14వ నిమిషంలో యోషికి మరో గోల్‌చేయడంతో జపాన్‌కు తిరుగులేని ఆధిపత్యం లభించింది. 17వ నిమిషంలో దిల్ ప్రీత్‌సింగ్‌ భారత తరఫున గోల్‌చేయడంతో భారత్‌ ఖాతా తెరిచింది. మరో వైపు జపాన్‌ ఆటగాడు కవాబీ 35నిమిషంలో, ర్యోమా 41వ నిమిషంలో గోల్‌ చేయడంతో జపాన్‌ గోల్స్‌ సంఖ్య ఐదుకు పెరిగింది. భారత్‌ వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌సింగ్‌ 43వ నిమిషంలో గోల్‌ చేయడంతో భారత్‌ ఖాతాలో రెండో గోల్‌ నమోదైంది. చివరిగా హార్దిక్‌ సింగ్‌ 58వ నిమిషంలో గోల్‌ చేసినా చివరకు 3-5 తేడాతో మన్‌ప్రీత్‌సేనకు ఓటమి తప్పలేదు. ఇంతకుముందు భారత్‌-జపాన్‌ జట్లు 18 సార్లు తలపడగా భారత్‌ అత్యధికంగా 16సార్లు విజయం సాధిస్తే జపాన్‌ ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. కాగా జపాన్‌ తుదిపోరులో దక్షిణకొరియాతో తలపడనుంది. కాంస్య పతకం కోసం నేడు భారత్‌-పాకిస్థాన్‌ తలపడనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement