Friday, November 22, 2024

Delhi | జనగామ కాంగ్రెస్ డీసీసీ నియామకంపై వ్యతిరేకత.. ఢిల్లీ బాట పట్టిన‌ జిల్లా నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిలో కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆ జిల్లా నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానం పెద్దల వద్ద తన అసంతృప్తిని వెలిబుచ్చగా.. తాజాగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. లింగాజి ఢిల్లీ చేరుకుని తెలంగాణ పీసీసీ తీరుపై ధ్వజమెత్తారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన లింగాజి, ఉదయపూర్ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా జనగామ డీసీసీ అధ్యక్ష నియామకం జరిగిందని అన్నారు.

అందుకే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఫిర్యాదు చేయడం కోసం ఢిల్లీ వచ్చానని వెల్లడించారు. కొమ్మూరు ప్రతాపరెడ్డి అనేక పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారని, ఎన్నికల ముందు పార్టీలు మారడం ఆయనకు పరిపాటి అని ఆరోపించారు. పైగా ఆయన జనగామ జిల్లా వాసి కాదని, పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యేవారు అదే జిల్లాకు చెందినవారై ఉండాలన్న నిబంధన ఉందని లింగాజి గుర్తుచేశారు.

- Advertisement -

జనగామ, భువనగిరి, నిర్మల్ జిల్లాల అధ్యక్షులుగా నియామకం కోసం రేవంత్ రెడ్డి రాసిన సిఫార్సు లేఖలో ఆ ముగ్గురు నేతలు సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారని, అది ముమ్మాటికీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. భువనగిరి, జనగామ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు చేసినట్లు రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారని, ఆయన సిఫార్సులను ఈ రెండు జిల్లాలకే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు వెంకటరెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదని, ‘స్టార్ క్యాంపెనర్’గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయలేదని లింగాజి ఆరోపించారు. అలాంటి వ్యక్తి జనగామ జిల్లాకు చేసిన సిఫార్సును ఎలా పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. స్థానికేతరులను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం స్థానిక కార్యకర్తలను తీవ్రంగా కలిసివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాల అధ్యక్ష నియామకాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగిందని లింగాజి అన్నారు. మొత్తం 35 జిల్లా అధ్యక్ష పదవులకు 22 అగ్రవర్ణ కులాలకే ఇచ్చారని, కేవలం 7 మాత్రమే బీసీలకు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కొమ్మూరి ఏ జిల్లా వ్యక్తో అధిష్టానానికి తెలియదని అందుకే నియామక ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. కాంగ్రెస్ రాజ్యాంగం, నియమావళి ప్రకారం స్థానిక వ్యక్తికే డీసీసీ పదవి ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement