మంగళగిరి – ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కలిసి నడవాలని టీడీపీతో కలసి నడవాలని జనసేనాని పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలను కోరారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కలిసి ముందుకెళ్లాలని జనసేన పార్టీ కార్యకర్తకలకు సూచించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలని ఉద్బోధించారు. జనసేన పార్టీలో వివిధ కమిటీల్లో స్థానం పొందిన 16 మందికి పవన్ కళ్యాణ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళదామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయభేరి మోగించాలని, ఆ దిశగానే టీడీపీతో కలిసి వెళుతున్నామని వివరించారు. ఇవాళ తాము సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతికూల సమయాల్లోనే నాయకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుందని పవన్ పేర్కొన్నారు.
రాష్ట్రానికి మనం బలమైన రీతిలో దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంత దూరం వచ్చామని వివరించారు. నాడు 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైందని, ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని వెల్లడించారు. పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా తానొక్కడినే తీసుకోవడంలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులేనని అన్నారు. ప్రజల్లో ఉన్న మనోభావాలను, క్రియాశీల సభ్యుల అభిప్రాయాలను పలు నివేదికల ద్వారా తెలుసుకుంటున్నానని వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే టీడీపీతో కలిసి ముందుకు వెళుతున్నామని ఉద్ఘాటించారు.