ఏపీలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు జనసేన నేతలు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా జనసేన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నయవంచనకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని.. ఇది అప్రజాస్వామికమని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల్లో జిల్లా ఉపాధి అధికారికి వినతి పత్రాలను ఇచ్చే కార్యక్రమాన్ని జనసేన చేపట్టిందని, అయితే వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తున్న తమ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వినతిపత్రాలు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో ఒక హక్కు అని, దాన్ని అడ్డుకోవడం నియంతృత్వ పోకడ అవుతుందన్నారు. జనసేన చేపట్టిన కార్యక్రమంతో సీఎం జగన్ ఇబ్బంది పడుతున్నారని నాదెండ్ల అన్నారు. ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసి, అమలు చేయమని చెపితే ఇబ్బంది కలుగుతోందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ వార్త కూడా చదవండి: పీవీ సింధుకు రెండు ఎకరాల భూమి కేటాయింపు