Friday, November 22, 2024

వాలంటీర్లు, పోలీసుల వల్లే వైసీపీ గెలిచింది: నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టారని, రోజుకు రూ.500 కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, సిమెంట్ ఆదాయం ఎక్కడికి పోతుందని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు, పోలీసుల వల్లే వైసీపీ గెలిచిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఎన్నికల్లో దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం చేయడాన్ని రాష్ట్రంలో తొలిసారి చూస్తున్నామని.. వైసీపీ పోకడలను జనసేన ధీటుగా ఎదుర్కొంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా ఎదుగుతామని తెలిపారు.

అటు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభివర్ణించడం జనసేన బలానికి నిదర్శనం అని పేర్కొన్నారు. సంస్థాగతంగా జనసేన ఇంకా బలపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కోరిన విధంగానే తిరుపతి ఉపఎన్నికలో మంచి అభ్యర్థిని బీజేపీ నిలబెట్టిందని, ఐఏఎస్ అధికారిగా ఎంతో అనుభవం ఉన్న రత్నప్రభ ఎంపీగా ఎన్నికైతే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతారన్న నమ్మకం ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మరో వారం రోజుల్లో తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement