Friday, September 6, 2024

ఏపీలో రోజుకు రూ.835 కోట్ల ఖర్చు.. ఎటుపోతోంది?: నాదెండ్ల మనోహర్

తూ.గో. జిల్లాలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. సూట్ కేసు కంపెనీలు పెట్టిన అనుభవంతో సూట్ కేసు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ఆర్ధికంగా దివాలా తీసే విధంగా జగన్ రెడ్డి పాలన సాగుతుందని ఆరోపించారు. ఇష్టారీతిన చేస్తున్న అప్పులు, నిధుల దుర్వినియోగం మీద కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీలు వేసే స్థాయికి రాష్ట్ర ప్రతిష్టను జగన్ దిగజార్చారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.లక్ష 56 వేల 848 కోట్లు అప్పులు తెచ్చారని, సగటున రోజుకు రూ. 835 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్లిపోతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘శాసనసభ సమావేశాలు నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సమావేశాలు నిర్వహించినా ఒకటి రెండు రోజులు తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు … ఈ రోజు సకాలంలో ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు వచ్చే ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు అంటే రాష్ట్ర ఖజానా ఎలాంటి స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

కరోనా నియంత్రణలో విఫలమయ్యారు


‘కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యి, ఎక్కువ మంది చనిపోయింది మన రాష్ట్రంలోనే. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వసతులు లేక నిరుపేద కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తో ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చుపెట్టలేక ఆర్థికంగా చితికిపోయారు. ప్రాణాలు నిలుపుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు క్యూలు కట్టి మందులు తీసుకోవాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది’ అని నాదెండ్ల అన్నారు.

మంత్రులకు శాఖలపై పట్టులేదు… సలహాదారులకు రిపోర్టు చేస్తున్నారు

- Advertisement -

‘యువకుడు ముఖ్యమంత్రి అయితే జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. పరిపాలన ఒకరిద్దరు సలహాదారులతో సాగిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? మంత్రులకు నోరులేదు. సొంత శాఖలపై పట్టులేదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా వారు పాలిస్తున్న శాఖలపై పూర్తి సమాచారం వారి దగ్గర లేదు. అన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు సలహాదారులే ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు వారికి రిపోర్టు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిస్థితి ఎన్నడు చూడలేదు. వచ్చే 20 ఏళ్ల రాబడిని కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు’ అని నాదెండ్ల ఆరోపించారు.

జీవోలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?

‘పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం దగా చేసింది. క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తున్నామని భారీ ఎత్తున ప్రకటనలు చేశారు. గతంలో ప్రకటించిన 6 లక్షల 50 వేల రూపాయలకు అదనంగా రూ.10 లక్షలు ఇస్తున్నారని అందరిని నమ్మించారు. ఈ ప్రభుత్వం అలా ఇవ్వడం లేదు. క్యాబినెట్ ఆమోదించిన ఆ జీవోను ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా దాచేశారు. లక్ష కుటుంబాలు నిర్వాసితులు అయితే కేవలం 4 వేల 293 కుటుంబాలకు మాత్రమే పునరావాసం అందించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ. 263 కోట్లకు మాత్రమే బిల్లులు ఇచ్చారు. నిర్వాసితులను మోసం చేస్తున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ప్రతి సంవత్సరం డెడ్ లైన్ పెట్టడం, నెలకోసారి హెలికాఫ్టర్ లో వెళ్లి రావడం, మూడు నెలల్లో పూర్తవుతుందని చెప్పడం తప్ప పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగంపై ప్రజలకు పూర్తి నమ్మకం పోయింది. జీవోలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు.

అప్పుల్లో ముందుకు… అభివృద్ధిలో అట్టడుగుకు


‘అభివృద్ధిలో రాష్ట్రం అట్టడుగుకు వెళ్లిపోతుంది. అప్పుల్లో ముందు ఉంది. ఉపాధి కల్పనపై ముఖ్యమంత్రికి దృష్టిలేదు. రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. మత్స్యకారులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. రోజు రూ. 835 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఆ నిధులు దేనికోసం ఖర్చు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పార్టీ నేతలు మేడా గురుదత్ ప్రసాద్, మరెడ్డి శ్రీనివాస్, సంకర కృష్ణవేణి, మాకినీడు శేషుకుమారి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement