తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కోదండరాం. అయితే నిన్న రాత్రి కోదండరాం.. ఫామ్‌హౌస్ వెళ్లి కేసీఆర్‌ను కలిశాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. దీని పై స్పందించిన కోదండరాం దీనిని తీవ్రంగా ఖండించారు. ప్రత్యర్థులు తనని ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని అన్నారు. గెలుపు అవకాశాలు తనకే ఉన్నాయని ప్రీపోల్ సర్వేల్లో తేలడంతో.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోదండరాం అన్నారు.
తాను ఎవరిని కలవలేదని..కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కోదండరాం. శనివారం( నిన్న) రాత్రి తాను హన్మకొండలోనే ఉన్నానని తెలిపారు. తమ పార్టీ రాజకీయంగా బలపడుతోందన్న అక్కసుతో కొదరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన గెలుపును ఓర్వలేని వారే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని… తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఆయన.