Friday, November 22, 2024

Delhi | బెయిల్ పత్రాలు అందుకున్న జానయ్య.. పలు కేసుల్లో బీజేపీ నేత‌ల‌పై అభియోగాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దొంగతనం సహా వివిధ అభియోగాలపై కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వట్టె జానయ్య యాదవ్‌ సోమవారం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పత్రాలు అందుకున్నారు. సూర్యాపేట చెరువులో 5 టన్నుల చేపలు దొంగిలించిన అభియోగంతో పాటు అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలతో ఆయనపై పోలీసులు పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఓబీసీలకు న్యాయం దొరకడం లేదని కారణం చూపుతూ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన జానయ్యపై మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్భలంతో తప్పుడు కేసులు నమోదు చేశారని జానయ్య ఆరోపిస్తున్నారు.

ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. జానయ్యపై 50 కేసులు ఉన్నాయని, బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడంతో హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జానయ్యకు శుక్రవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సంజయ్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపిన విచారణలో జానయ్య తరఫున సీనియర్ న్యాయవాదులు దామ శేషాద్రి నాయుడు, నళిన్ కోహ్లి వాదనలు వినిపించారు.

అర్థరాత్రి గం. 3.00 సమయంలో 5 టన్నుల చేపలు దొంగిలించడం అసాధ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్‌ను దుర్వినియోగపరుస్తోందని, మరో కొత్త ఎఫ్ఐఆర్ సృష్టించి జానయ్య యాదవ్‌ను అరెస్ట్ చేయదన్న గ్యారంటీ లేదని తెలిపారు. జానయ్య తరఫు న్యాయవాదుల వాదనలో ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. ఆ బెయిల్ పత్రాలు సోమవారం ఆయన తరఫు న్యాయవాది శ్రవంత్ శంకర్ అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement