హైదరాబాద్, ఆంధ్రప్రభ : రానున్న అసెంబ్లి ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ముమ్మర కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ కసరత్తు మొదలు పెట్టారు. ప్రస్తుతానికి తెలంగాణలోని 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేఇక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేయనుందని అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో జరిగే భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన జనసేన పార్టీ నేతలు హాజరయ్యారు. ఏపీలో జనవాణి కార్యక్రమంతో తన గ్రాఫ్ పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.