Saturday, November 23, 2024

Jana Garjana -భావి భార‌త్ కు రాహుల్ గాంధీ దిక్సూచి – పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

ఖమ్మం జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. పొంగులేటితో పాటు ప‌లువురు నాయ‌కులు కూడా ఈ వేదిక‌పైనే కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.. అలాగే ఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు.

ఎమ్మెల్యే సీతక్కను కూడా భుజం తట్టి అభినందించారు రాహుల్. వేదికపై రాహుల్ గాంధీకి ప్రజా గాయకుడు గద్దర్ ముద్దు పెట్టారు.
ఇక పార్టీలో చేరిన అనంత‌రం తొలిసారిగా రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో మాట్లాడిన పొంగులేటి ముఖ్య‌మంత్రిపై విరుచుకుప‌డ్డారు.. మాయ‌మాట‌ల‌తోనే రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చార‌ని, ఇక ఆయ‌న ఆట‌లు సాగ‌వ‌ని అన్నారు.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ పని చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పొంగులేటి అన్నారు. ఖమ్మం సభకు తరలివచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. భావిభారత్ కు రాహుల్ గాంధీ దిక్సూచి అని అన్నారు.
అంతకుముందు ఖమ్మం సభా ప్రాంగణం వద్ద హెలికాప్టర్ దిగగానే చేరుకోగానే గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. వారికి అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు వేదికపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్‌రావు ఠాక్రే, గిడుగు రుద్రరాజు, ఇతర కీలక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement