జమ్ముకశ్మీర్లోని కథువాలో నేటి తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. . శివనగర్లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది.దీంతో ఊపిరాడక అవతార్ కృష్ణ (81), బర్ఖా రైనా (25), గంగా భగత్ (17), దానిష్ భగత్ (15), అద్విక్ రైనా(4), తకాశ్ రైనా (3) ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లారు.
వారిని చికిత్స నిమిత్తం కథువాలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అగ్ని ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంటికి మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.