శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దోడా ప్రాంతంలో అస్సార్ వద్ద ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. 19 మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. క్షతగాత్రుల్ని కిష్తావర్, దోడా సీఎంసీ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బటోటే-కిష్తావర్ జాతీయ రహదారిపై బత్రుంగల్-అస్సార్ వద్ద బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతున పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్ము డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
దోడా ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ప్రధాని.. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.