ఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. జమ్ములో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది..
415 మంది అభ్యర్ధుల భవితను 39.18 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 5,060 కేంద్రాల్లో పోలీంగ్ కొనసాగుతోంది. కాగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తుది విడత పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ దశలో 7 జిల్లాల్లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 3.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మూడో విడతలో మొత్తం 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మరోవైపు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అదీకూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పార్టీ జత కట్టి వెళ్తుంది. బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ) పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి.
మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిలో హిజుబొల్లా నేత నస్రల్లా మృతి చెందారు. అందుకు నిరసనగా కాశ్మీర్‌లో ఇటీవల నిరనసలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఈ తుది విడత పోలింగ్ వేళ భారీ కట్టుదిట్టమైన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్‌కు మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇఫ్పటికే సెప్టెంబర్ 18వ తేదీన తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. ఇక రెండో విడతలో 50 శాతం పోలింగ్ నమోదు జరిగింది.
ఈరోజు జరగుతున్న తుది పోలింగ్‌లో సైతం భారీగానే ఓటింగ్ శాతం నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు విడత పోలింగ్‌ను వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పరిశీలించనున్నారు. ఇప్పటికే రెండో విడత పోలింగ్ వేళ.. పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
. ఆ క్రమంలో ఓటర్లను సైతం వారు కలిసి…క్షేత్ర స్థాయిలో పరిస్థితలపై ఆరా తీసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. e నెల 8వ తేదీన వెలువడనున్నాయి…