Saturday, November 23, 2024

Delhi | జమిలి మా ఎజెండాలో ఉంది.. అందరితో సంప్రదించాకే నిర్ణయం : జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పేరుతో దేశంలో లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది తమ ఎజెండాలో ఉందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. పదే పదే జరిగే ఎన్నికల కారణంగా ప్రజాధనం వృధా అవడంతో పాటు పాలనకు ఆటంకం ఏర్పడుతోందని అన్నారు. ఈ పరిస్థితిని నివారించడం కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని తెలిపారు.

అందుకే మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారని, అందులో కేంద్ర హోంమంత్రి కూడా సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ కమిటీ అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చిన తర్వాతనే జమిలి ఎన్నికలపై నిర్ణయం ఉంటుందని, ఆ క్రమంలో పార్లమెంటులో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నిర్ణయం జరగుతుందని వెల్లడించారు. కానీ ఈలోగా రేపు, మాపు జమిలి ఎన్నికలు అంటూ కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఆవేశపడిపోయి ఆయాసం తెచ్చుకోవడం తప్ప మరేమీ లేదని అన్నారు.

సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుందో రాదో చెప్పలేమని, కాకపోతే ఈ సమావేశాల్లో కచ్చితంగా ప్రత్యేకాంశాలు ఉంటాయని ఆయనన్నారు. అవేంటో తెలుసుకోవాలన్న ఆతృత దేశవ్యాప్తంగా అందరికీ ఉందని, కొద్ది రోజులు ఆగితే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంతో తేలిపోతుందని అన్నారు.

ఒకట్రెండు రాష్ట్రాల్లో ప్రయోజనం ఆశించి జమిలి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలు, ముందుచూపుతో తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఉద్దేశంతో జమిలి ఎన్నికలకు ఆలోచన చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. 2018లో కూడా చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో ఓటమి పాలయ్యామని, ఆ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, తాజాగా కర్ణాటక ఎన్నికల్లో కూడా ఓడిపోయామని గుర్తుచేశారు. ఈసారి మాత్రం రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవుతుందని, చత్తీస్‌గఢ్‌లో పోటీ ఉంటే ఉండొచ్చని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement