Friday, November 22, 2024

Delhi | లా కమిషనర్ పరిశీలనలో జమిలి ఎన్నికలు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అంశం (జమిలి ఎన్నికలు) లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గురువారం రాజ్యసభలో ఎంపీ కిరోడిలాల్ మీనా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీలక విషయాలు వెల్లడించారు. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని, కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత విభాగాలతో కలిసి ఈ మేరకు సంప్రదింపులు జరుపుతోందని తెలిపిారు.

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, ఎన్నికల నిర్వహణ కోసం పెట్టే ఖర్చు పెద్ద మొత్తంలో ఆదా అవుతుందని, తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు పదే పదే ఎన్నికల నియమావళి అమలు చేయడం కారణంగా తలెత్తే పాలనాపరమైన ఇబ్బందులను కూడా పరిమితం చేయవచ్చని పేర్కొన్నారు. అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా సమస్యలు అధిగమించాల్సి ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని 5 కీలకమైన అధికరణాలను సవరించాల్సి ఉంటుందని తెలిపారు.

- Advertisement -

పార్లమెంట్ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 83, పార్లమెంటును రాష్ట్రపతి రద్దు చేసే అధికారం కల్గిన ఆర్టికల్ 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 172, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేసే అధికరణ ఆర్టికల్ 174తో పాటు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356ను సవరించాల్సి ఉంటుందని వివరించారు. అదే సమయంలో వివిధ రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని కూడా తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో నిర్మితమైన ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలకు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని కూడా అన్నారు.

అలాగే ఒకేసారి లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల నిర్వహణకు తగినన్ని ‘ఈవీఎం – వీవీప్యాట్’ యంత్రాలను కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తగినంత అదనపు ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందిని కూడా సమకూర్చుకోవాలని తెలిపారు. ఈ అంశంపై కసరత్తు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దక్షిణాఫ్రికా సహా మరికొన్ని దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేసిందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement