Friday, November 22, 2024

Delhi | జమిలి ఎన్నికలే మేలు, ప్రజాధనం ఆదా.. రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో జమిలి ఎన్నికలతో బహుముఖ ప్రయోజనాలున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. భారీ ఖర్చుతో కూడుకున్న ఎన్నికల ప్రక్రియలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని స్పష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ కి చెందిన ఎంపీ హర్‌నాథ్ సింగ్ యాదవ్ (బీజేపీ) గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణపై పలు అంశాలు ప్రస్తావించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52, 1957, 1962, 1967 వరకు ఏక కాలంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని తెలిపారు. 1968లో కొన్ని రాష్ట్రాలు 1969లో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువు కంటే ముందే రద్దు కావడంతో ఈ వరుస క్రమానికి అంతరాయం ఏర్పడిందని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని అన్నారు. ఎన్నికల చట్టాల సంస్కరణలపై లా కమిషన్ ఇచ్చిన 170వ నివేదికలో కూడా ఏకకాలంలో అసెంబ్లీలకు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని సూచించిందని పేర్కొన్నారు. తద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని ఆదా చేయడం మాత్రమే కాదు పాలనలో సుస్థిరత ఏర్పడుతుందని కూడా పేర్కొందని కిరెన్ రిజిజు వెల్లడించారు.

- Advertisement -

పదే పదే జరిగే ఎన్నికల కారణంగా పాలనపరంగా, శాంతిభద్రతల పరంగా తలెత్తే సమస్యలు తగ్గుతాయని, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సైతం ప్రచార ఖర్చు ఆదా అవుతుందని వెల్లడించారు. అలాగే ఎన్నికలు, ఉప-ఎన్నికల సమయంలో అమలు చేసే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) కారణంగా ప్రభుత్వ పథకాలు, ఇతర పాలనపరమైన కార్యక్రమాలకు విఘాతం కలుగుతూ ఉంటుందని, ఒకేసారి ఎన్నికలు (జమిలి) నిర్వహించడం వల్ల ఈ ప్రతికూలతలను అధిగమించవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement