Wednesday, December 18, 2024

Delhi | రేపే లోక్ స‌భ‌లో జ‌మిలీ బిల్లు..

  • జ‌మిలిపై ఫైన‌ల్ డెసిష‌న్‌..
  • లోక్‌సభ ముందుకు వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ బిల్లు
  • ఆ త‌ర్వాత చ‌ర్చ కోసం జేపీసీ మందుకు పంపే చాన్స్‌
  • ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను ఊటంకిస్తూ మీడియాలో క‌థ‌నాలు
  • స్వాతంత్య్రం వ‌చ్చిన తొలినాళ్ల‌లోనే భార‌త్‌లో జ‌మిలి
  • రాష్ట్రాలు, లోక్‌స‌భ‌కు ఒకేసారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌
  • బ‌ర్త‌ర‌ఫ్ వంటి ప‌లు కార‌ణాల‌తో గాడిత‌ప్పిన ఎన్నిక‌ల తీరు
  • బిల్లు పాస్ కావాలంటే మూడోంతుల మంది స‌భ్యులు ఓటేయాలి


ఆంధ్రప్రభ స్మార్ట్​, న్యూఢిల్లీ : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. ఆ తర్వాత దీన్ని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్టు తెలుస్తోంది.

రివైజ్డ్​ జాబితాలో కనిపించని బిల్లులు..
వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు) ను సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా రివైజ్‌ చేసిన లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్‌ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు. దీంతో ఈ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు. మంగళవారం ఈ బిల్లులు లోక్‌షభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.

తొలినాళ్లలోనే జమిలి ఎన్నికలు..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే.. అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి.

- Advertisement -

దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. కాగా, లోక్ స‌భ‌లో ఈ బిల్లు పాస్ కావాలంటే మూడో వంతు మంది స‌భ్యులు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది.. లోక్ స‌భ లో 542 కాగా, ఎన్డీఎ కూట‌మికి 293 మంది స‌భ్యుల బ‌లం ఉండ‌గా, విప‌క్షాల ఇండియా కూట‌మికి 235 మంది స‌భ్యులున్నారు.. ఈ బిల్లు పాస్ కావాలంటే ఎన్డీఎ కూట‌మికి మ‌రో 68 మంది స‌భ్యుల ఓట్లు అవ‌స‌రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement