నాసా ఇటీవల అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) మరో సంక్లిష్ట ప్రక్రియను విజయవంతంగా అధిగమించింది. ఈ టెలిస్కోప్‌కు చెందిన బంగారు వర్ణం దర్పణం శనివారం విజయవంతంగా విచ్చుకుంది. దీంతో ఈ టెలిస్కోపును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సంక్లిష్ట అవరోధాలు దాదాపు పూర్తయినట్లేనని నాసా పేర్కొంది. ప్రయోగ సమయంలో రాకెట్‌లోని పరిమిత చోటులో పట్టేలా జేడబ్ల్యూఎస్‌టీని మడతపెట్టి ఉంచారు. రోదసిలోకి చేరాక దీన్ని దశలవారీగా విచ్చుకునేలా శాస్త్రవేత్తలు చర్యలు చేపడుతున్నారు.
తాజాగా విచ్చుకున్న దర్పణం వెడల్పు 6.5 మీటర్లు. పరావర్తన సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ దర్పణానికి బంగారు పూత పూశారు. అందువల్ల దీన్ని ‘బంగారు నేత్రం’గా కూడా పిలుస్తున్నారు. దాదాపు వెయ్యి డాలర్లతో రూపొందిన ఈ టెలిస్కోపు 13.7 బిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన తొలినాటి నక్షత్రాల తీరుతెన్నులను పరిశీలించ డానికి ఉపయోగపడుతుంది. వచ్చే రెండు వారాల్లో జేడబ్ల్యూఎస్‌టీ దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్2 ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడే స్థిరంగా ఉంటూ ఖగోళ రహస్యా లను ఛేదించి, విశ్వం ఆవిర్భావ మూలాలను శోధిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital