Tuesday, November 26, 2024

టైమ్ మెషీన్ రెడీ.. త్వ‌ర‌లో స్పేస్ లోకి..

ఖగోళ శాస్త్రవేత్తలు మరో అద్భుత ఆవిష్కరణను సిద్ధంచేశారు. విశ్వంలో పాలపుంతల పుట్టుకకు సంబంధించిన రహస్యాలను ఛేదించబోతున్నారు. ఇందుకోసం జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (జెడబ్ల్యుఎస్‌టి)ను నిర్మించారు. టైమ్‌ మిషిన్‌గా పేర్కొనే ఈ టెలిస్కోప్‌ను క్రిస్మస్‌ రోజున ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇది నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఇఎస్‌ఎ), కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (సిఎస్‌ఎ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. 1990లో ప్రయోగించబడిన విప్లవాత్మక హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌కు వారసుడిగా, విశ్వంలో ఏర్పడిన కొన్ని తొలి గెలాక్సీలను కనుగొనడానికి, వాటిని అర్థం చేసుకోవడంలో ఖగోళ శాస్త్రవేత్తలకు జెడబ్ల్యుఎస్‌టి సహకరిస్తుంది.

మన సొంత పాలపుంత వంటి గెలాక్సీలు ఎలా ఉనికిలోకి వచ్చాయో తెలుసుకునేందుకు ఈ కాలయంత్రం కీలకంగా మారనుంది. ఇది 6.5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. 2.4 మీటర్ల హబుల్‌ టెలిస్కోప్‌ దర్పణం (అద్దం) కంటే చాలా పెద్దది. దాని పరారుణ పరిశీలన సామర్థ్యాలు జెడబ్ల్యుఎస్‌టిని ప్రత్యేకమైన టెలిస్కోప్‌గా చేస్తాయి. సుదూర గెలాక్సీలలోని నక్షత్రాల ను అలాగే మన గెలాక్సీలోని ఇతర నక్షత్రాల చుట్టూ ప్రదక్షిణ చేసే సంభావ్య గ్రహాల వాతావరణాలలో అత్యంత సున్నిత మైన పరిశీలనలను చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

నక్షత్రాలు, గెలాక్సీలలోని బ్లాక్ హోల్స్‌, గ్రహాల జీవితాల గురించి జేడబ్ల్యుఎస్‌టి తన సర్వేని చేపడుతుంది. దాదాపు 13.5 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నిర్మాణాన్ని అధ్యయనం చేయడం, విశ్వం శైశవదశలో ఉన్న సమయంలో, తొలి నక్షత్రాలు చీకట్ల నుంచి బయటపడటం, ఆ తర్వాత విశ్వంపై కాంతిని వెదజల్లడం వంటి విషయాలను శోధించడం ఈ కాలయంత్రం ప్రధాన లక్ష్యాలు. బిలియన్ల సంవత్సరాలలో గెలాక్సీలు ఎలా కలిశాయో అర్థం చేసుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు సహాయ ప‌డుతుంది. టెలిస్కోప్‌ మన స్వంత సౌర వ్యవస్థలోని వస్తువుల వివరణాత్మక వీక్షణను అందించడంతో పాటు సూర్యుని చుట్టూ తిరిగే సంభావ్య నివాసయోగ్యమైన ఇతర ఎక్సోప్లానెట్‌ల వాతావరణాన్ని అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement