ప్రైజీ మనీ కోసం వివాదం
గ్రామస్తుల మధ్య
30 మందికి గాయాలు
ఎనిమిది మంది పరిస్థితి విషమం..
ఆంధ్రప్రభ స్మార్ట్, చెన్నై : తమిళనాడులో పుదక్కోట్టైలో జలికట్టు క్రీడ నిలిచిపోయింది. శనివారం పుదుక్కోట్టై లో జల్లికట్టు క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులతో రైతులు హాజరయ్యారు. సుమారు 300 మందికిపైగా యువకులు ఎద్దులను నిలవరించేందుకు సిద్ధపడ్డారు. ఇంతలో ప్రైజ్‌మనీ కోసం వివాదం ప్రారంభమైంది. రెండు వర్గాల మధ్య కొట్లాట చోటు చేసుకుంది.
30 మందికి గాయాలు
పుదుక్కోట్టైలో జల్లికట్టు గ్రౌండ్‌లో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. కుర్చీలు విసురుకున్నారు. ఈ కొట్లాటలో ముప్పయి మంది గాయపడ్డారు. అందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. ఇరువర్గాలను పోలీసులు సముదాయించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో జల్లికట్టు ఆటను నిలిపివేశారు.
అనాదిగా ఆచారం
తమిళనాడు రాష్ట్రంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు ఉత్సవం జరుపుకుంటారు. జల్లికట్టు అంటే ఎద్దులను, కోడెలను బెదరగొట్టి ఒక మార్గం గుండా గుంపులుగా వదిలిపెడుతారు. గుంపులుగా పరుగులు తీస్తున్న ఎద్దులను యువకులు లొంగిదీసే ప్రయత్నం చేస్తారు. అలా లొంగదీసిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. జనవరి నుంచి మే 31 మధ్య సాధారణంగా 120కిపైగా జల్లికట్టు ఈవెంట్‌లు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ ఎద్దుల క్రీడలను చూసేందుకు తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు.