భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఇవ్వాల (బుధవారం) విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ తాజా జాబితాలో 11 స్థానాలు ఎగబాకి 63వ స్థానానికి చేరుకున్నాడు జైస్వాల్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తో 466 పాయింట్లు సోంతం చేసుకుని బ్యాటర్స్ జాబితాలో చోటు సంపాదించాడు యశస్వి జైస్వాల్.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటర్లలో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. రెండో టెస్టులో 80, 57 స్కోర్లు చేసిన రోహిత్.. 759 పాయింట్లతో అత్యధిక ర్యాంక్ కలిగి ఉన్న ఇండియన్ బ్యాటర్ గా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక, రిషబ్ పంత్ 743 పాయింట్లతో ఒక స్లాట్ దిగజారి 12వ స్థానానికి చేరుకోగా.. 733 పాయింట్లతో విరాట్ కోహ్లీ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.
న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 883 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గతంలో అగ్రశ్రేణి బ్యాటర్లు ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుస్‌చాగ్నే, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ మూడు స్థానాలు ఎగబాకి వరుసగా రెండు, మూడవ స్థానాలకు చేరుకున్నారు.
బౌలర్ల జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (879) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రవీంద్ర జడేజా (782) ఆరో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా.. పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఆరు స్థానాలు ఎగబాకి పాయింట్స్ టేబుల్ లో 33వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
ఇక ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్‌లు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, అక్షర్ పటేల్ ఐదో ర్యాంక్‌లో స్థిరంగా ఉన్నాడు.