ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని గురువారం ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, పార్లమెంట్ ఉభయ సభల్లో బలమైన గళం వినిపించారని సీఎం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, బెల్లంపల్లి, పరిగి ఎంఎల్ఏలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాయకులు రోహిన్ రెడ్డి, విద్యాసాగర్ పాల్గొన్నారు.