Sunday, November 17, 2024

AP | జైలా?.. బెయిలా!.. అవినాష్‌ అరెస్టు చేస్తామని ప్రకటించిన సీబీఐ

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 25 వరకు హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేస్తూ బెయిల్‌ విషయం హైకోర్టులోనే తేల్చుకోవాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. మంగళవారమే ఈ పిటిషన్‌ పై విచారణ జరగాల్సి ఉండగా సుప్రీంకోర్టు తీర్పు ప్రతి రాకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది.

అయితే, బుధవారం పిటిషన్‌ కేసుల జాబితాలో లేకపోవడంతో గురువారం విచారిస్తామని కోర్టు తెలిపింది. గురువారం 3.30 గంటలకు హైకోర్టులో జరిగే విచారణ ఉత్కంఠగా మారింది. ఎంపి అవినాష్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తుందా ? లేదా ?అనే విషయం ఆసక్తికరంగా మారింది. బెయిల్‌ దొరికితే ఓకే లేకపోతే మాత్రం ఆయన్ను అరెస్టు చేసేందుకు కేందం దర్యాప్తు సంస్థ (సీబీఐ) కాచుకొని కూర్చుందని చెప్పవచ్చు. పలుమార్లు హైకోర్టులో ఆ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్‌ పై జరిగిన విచారణ సందర్భంగా అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేస్తామని సీబీఐ నివేదించిన నేపథ్యంలో విచారణపై ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తన తరపున వాదనలను వినిపించేందుకు సుప్రీంకోర్టులో పేరున్న సీనియర్‌ న్యాయవాదులను అవినాష్‌ రెడ్డి నియమించుకున్నారు.

ఇదిలా ఉండగా, జూన్‌ 30 వరకు దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఎక్కడ,ఎవరిని విచారిస్తే ఏ ఆధారం దొరుకుతుందో అని భావించి వారికి నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా అవినాష్‌ రెడ్డి కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, ఎ6 నిందితుడుగా ఉన్న ఉదయకుమార్‌ రెడ్డి తండ్రి గజ్జల జయ ప్రకాష్‌ రెడ్డిలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో పులివెందులలోఇద్దరిని కూడా విచారించినప్పటికీ మరోసారి విచారించాలని నోటీసులు ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్యకు గురైన తర్వాత ఘటన ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను ఇనాయతుల్లా తీశారు. జయప్రకాష్‌ రెడ్డి పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కంపౌండర్‌గా పని చేస్తారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన సందర్భంగా ఆయనకు కాటన్‌ బ్యాండేజీ కట్టారని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

వివేకా రెండో భార్య షమీమ్‌ స్టేట్‌మెంట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా?
వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్‌ తాజాగా సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ఉన్నత న్యాయస్థానం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందనేది కూడా చర్చగా మారింది. ఆమె సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో అవినాష్‌ రెడ్డి పేరు లేదా ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి పేరు లేదు. అంతేగాక తమ మధ్య ఆస్తుల గొడవలు ఉన్నాయని, వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డితో పాటు ఆయన బావమర్ది తనను పలుమార్లు బెదరించారని కూడా వివరణ ఇచ్చారు. గతంలో బెయిల్‌పై జరిగిన వాదనల సందర్భంగా షమీమ్‌ స్టేట్‌మెంట్‌ విషయం చర్చకు రాలేదు. గురువారం జరిగే విచారణ సందర్భంగా ఈ విషయం కూడా అవినాష్‌ రెడ్డి న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించే అవకాశం ఉంది.

ఉదయ్‌కుమార్‌ రెడ్డి రిమాండ్‌ పొడిగింపు
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎ6 నిందితుడుగా ఉన్న గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి రిమాండ్‌ను సీబీఐ కోర్టు మరోమారు పొడిగించింది. మే 10 వరకు ఆయన రిమాండ్‌ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెస 14 న ఉదయ్‌కుమార్‌ రెడ్డిని పులివెందుల పట్టణంలోని ఆయన ఇంటిలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు సీఆర్‌పీసీ 161 నోటీసు ఇవ్వడమే గాక ఆయన తల్లికి మెమో ఇచ్చి మరీ అరెస్టు చేశారు. సీబీఐ కోర్టులో సీబీఐ వేసిన కస్టడీ పిటిషన్‌ మేరకు 18 న ఆరు రోజుల పాటు ప్రత్యేక కోర్టు కస్టడీకి ఇచ్చింది. 19 నుంచి 24 వరకు కస్టడీలో ఉదయ్‌కుమార్‌ రెడ్డిని సీబీఐ విచారించింది.

ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై వాదనలు పూర్తి -తీర్పు రిజర్వు
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వుచేశారు. గురువారం తీర్పు వెలువడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement