న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మూడ్రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) శుక్రవారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. అంతకు ముందు రోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి, వరుసగా అధిష్టానం పెద్దలతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి వారికి వివరిస్తున్నారు. కేసీ వేణుగోపాల్‌తో జరిగిన భేటీలోనూ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ను చర్చలో లేకుండా చేయడం కోసం చేస్తున్న లోపాయికారి రాజకీయాల గురించి వివరించినట్టు తెలిపారు.
ఆ రెండు పార్టీలూ కలిసి తమ చేతుల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా దర్యాప్తు సంస్థలతో పరస్పరం దాడులు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ చర్చలో లేకుండా పోతుందని, ఈ ప్రభావం ఎన్నికలపైనా పడుతుందని చెప్పారు. ఆ పార్టీల లోపాయకారి రాజకీయాలను తిప్పికొట్టే వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, ఏఐసీసీ స్థాయిలోనే వ్యూహాలు రచించాలని జగ్గారెడ్డి అధిష్టానం పెద్దలకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోనియా గాంధీ, ప్రియాంక వాద్రాలను కూడా కలిసేందుకు జగ్గారెడ్డి అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది.