ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర : దేశంలోకెల్లా అత్యధికంగా సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక అవరోధాలను అధిగమించి సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించారు. సంక్షేమ పథకాల అమలుకు ఎదురవుతున్న ఆర్థికపరమైన అవరోధాలను అధిగమిస్తూనే ప్రమాదపుటంచున వున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అహరహం శ్రమిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమంపై ప్రభుత్వాధినేత దృష్టి పెట్టడం అభినందనీయమే. ప్రభుత్వాధినేతగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న వైఎస్ జగన్మోహన రెడ్డి పార్టీ అధినేతగా తన బాధ్యతలను విస్మరిస్తున్నారన్న భావన వ్యక్తం అవుతున్నది. దీంతో జగన్మోహన రెడ్డి పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై మూడున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సంతృప్తికరంగా వున్న సూచనలు కానరావడం లేదు. క్షేత్ర స్థాయిలో పార్టీపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక నాయకత్వం పూర్తిగా గాలికి వదిలేసింది అన్న విమర్శలు ఆపార్టీ కార్యకర్తల నుంచే వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకపోవటంతో వారంతా లోలోన మధన పడుతున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
పార్టీ నిర్మాణానికి తిలోదకాలు :
అధికారంలోకి వచ్చేవరకు పార్టీనిర్మాణం ఎంతో పటిష్టంగా వుండేది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అనుసరించిన విధివిధానాలను పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం పార్టీ నిర్మాణం సందర్భంగా అనుసరించాయి. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుంది. ఇదే విధానాన్ని ఇతర పార్టీలు సైతం అనుసరించాయి. బూత్ స్థాయిలో కమిటీల ఏర్పాటుతో పటిష్టమైన వ్యవస్థ వుండేది. 2019 ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి రావటంలో బూత్ కమిటీల పాత్ర కొట్టిపారేయలేనిది. అయితే ఇప్పుడు ఆ బూత్ కమిటీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అధికారం చేపట్టిన మూడున్నర సంవత్సరాలుగా ఏ స్థాయిలోనూ కనీసం ఒక్కటంటే ఒక్క పార్టీ సమావేశం సైతం ఏర్పాటు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం సన్నగిల్లుతున్న సూచనలు కానవస్తున్నాయి. భుజాలు కాయలు కాసేలా పార్టీ పతాకాలు మోసిన వైఎస్ వీరవిధేయులు పార్టీకి పెట్టని కోటలాంటి వారన్న తలంపే లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ కార్యకర్తలు లోలోన కుమిలిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలో నూతనంగా ప్రవేశించిన వలస నాయకుల ఏకపక్ష పోకడలు పూడ్చలేని నష్టాన్ని మిగులుస్తుందన్న ఆవేదన వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. కొంతమంది నాయకులు పార్టీ ప్రయోజనాల కంటే స్వంత, వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అధికార పార్టీలో వైఎస్ వీరవిధేయులకు, వలస నేతలకు ఏమాత్రం పోసగటం లేదన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి.
వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో వుండగా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగట్టడంలోనూ, ఇతర పార్టీల నాయకులు చేసే విమర్శలు తిప్పికొట్టడానికి పార్టీ నాయకులు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆ పార్టీ ముఖ్యులు వారి అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. విపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలను అధికార పదవుల్లో వున్న కొద్దిమంది నాయకులు మాత్రమే తిప్పికొట్టాల్సిన పరిస్థితి నెలకొని వుంది. పార్టీ పరంగా వాటిని క్షేత్రస్థాయి నుంచి తిప్పికొడుతున్న దాఖలాలు కానరావడం లేదు. దీనివల్ల పార్టీకి సంబంధించి మౌత్ పబ్లిసిటీ కరవైంది. ప్రతిపక్షంలో వుండగా అధినాయకుడు ఒక్క పిలుపునిస్తే అనూహ్య రీతిలో విజయవంతమయ్యేది. దిగువస్థాయి నుంచి పార్టీ యంత్రాంగం అంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా స్పందించే వారు. సహజంగా అధికారంలోకి రాగానే క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తాలి. అయితే అందుకు భిన్నంగా వారిలో నైరాశ్యం ఆవరించి ఉందన్న భావన ఆ పార్టీ ముఖ్యుల్లో సైతం నెలకొని వున్నది. పార్టీ అధికార పీఠం అధిష్టించే వరకు క్రియాశీలంగా వ్యవహరించిన నాయకుల్లో చాలామంది ప్రస్తుతం చురుకుగా వ్యవహరించటం లేదన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి. విపక్షంలో వుండగా జన శ్రేణులతో కళకళలాడిన పార్టీ కార్యాలయాలు నేడు వెలవెల బోతున్నాయి. చాలా చోట్ల పార్టీ కార్యాలయాల జాడే లేదు. దీంతో కార్యక్రమాల నిర్వహణకు ఒక కేంద్ర స్థానం లేకపోవడంతో చాలా చోట్ల నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.