న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తు ఢిల్లీ పర్యటన అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కనకమేడల, ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలను మధ్యలో వదిలేసి మరీ ఢిల్లీకి పరుగులు తీయడం వెనుక కుటుంబ సభ్యులను కాపాడుకోవడం మినహా మరే కారణం కనిపించడం లేదని అన్నారు. సాధారణంగా ఏ కేసులోనైనా ప్రత్యక్ష సాక్షులు, సందర్భోచిత సాక్ష్యాధారాలు అని ఉంటాయని, జగన్ పర్యటనలో కూడా సమయం, సందర్భం అలాగే ఉందని అన్నారు. పైకి చెప్పే కారణం ఏదైనా సరే అసలు సందర్భం మాత్రం అవినాశ్ రెడ్డిని కాపాడుకోవడమేనని ఆరోపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రికి ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థ అభియోగం మోపిందని, రేపో మాపో అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుండగా.. సీఎం జగన్ హుటాహుటిన ఢిల్లీ పర్యటన చేపట్టడం, నిందితుడిని వెంటబెట్టుకుని తిరగడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షా ను కలిసి, కేసుల నుంచి బయటపడేయాలని ప్రాధేయపడ్డట్టుగానే కనిపిస్తోందని విమర్శించారు. సీఎం జగన్ ఢిల్లీకి 16, 17 సార్లు ఢిల్లీ వచ్చారని, వచ్చినప్పుడల్లా ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నారని, అందులో పైనున్న సమాచారం కిందికి, కింద ఉన్న సమాచారం పైకి మార్చి ఇవ్వడం మినహా ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు.
మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన వెంటిలేటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని సూత్రీకరించారు. కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిన్యాల మీద నడుస్తున్న ఈ ప్రభుత్వం ఆక్సిజన్ పైప్ తీసేసిన మరుక్షణంలో చచ్చిపోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామంటూ ఎన్నో మాటలు చెప్పిన జగన్, గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచడం మాట అటుంచి, తమ మెడలు కేంద్రం ముందు వంచారని విమర్శించారు. మడమ తిప్పను, మాట తప్పను అంటూ మడమ తిప్పి నడుస్తున్నారని ఆరోపించారు. కాగ్ చెప్పిన లెక్కల ప్రకారం అప్పు చేయకుండా ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి నెలకొందని కనకమేడల రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెబుతున్న ప్రభుత్వం, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు సహా కేంద్ర ప్రభుత్వం చేసిన హామీలపై పోరాటం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉండే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్)ను చూసైనా పోరాడాలన్న ఆలోచన ఎందుకు రావడం లేదని నిలదీశారు. ఢిల్లీ మద్యం పాలసీ గురించి చర్చ జరుగుతోందని, కానీ ఏపీలో అమలవుతున్న మద్యం విధానాన్ని తవ్వితే ఎన్ని స్కాములు, ఎన్ని పాములు బయటికొస్తాయో తెలియదని కనకమేడల రవీంద్ర కుమార్ వ్యాఖ్యానించారు.