Monday, November 18, 2024

జగన్‌ మంత్రివర్గ కూర్పు ఒక ప్రహాసనం.. ఆ 13 మంది అసమర్థులా, అవినీతిపరులా: తులసిరెడ్డి

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి జగన్‌ మంత్రివర్గం కూర్పు ఒక ప్రహాసనమని, కొత్తగా ఎంపికైన మంత్రులు కూడా ఉత్సవ విగ్రహాలేనని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. విధులు, నిధులు అధికారాలు లేని మంత్రి పదవులు ఉన్నా, లేకున్నా ఒకటేనని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డి విమర్శించారు. ఇంతకీ పాత వారిలో 13 మంది అసమర్ధులా? అవినీతి పరులా? అన్నది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూడు నెలల పాటు సాము గారడీ చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుగా మంత్రి వర్గ కూర్పు ఉందని ఎద్దేవా చేశారు. ఇంత కసరత్తు చేసి సాధించింది ఏమిటి అని, పాత వారిలో 11మంది, కొత్తగా 14మందితో ఏర్పాటు చేయడం కొండని తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు.

26 జిల్లాల్లో 8 జిల్లాలకు మంత్రి వర్గం లో ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇదేనా అధికార వికేంద్రీకర ణ అని ప్రశ్నించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, ఒంటరి తదితర సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదని, ఇదేనా మీ సామాజిక న్యాయం అని ధ్వజమత్తారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్టీల్లో 34 ఉప కులాలు ఉన్నా 33 ఎస్టీ ఉప కులాలకు ప్రాతినిధ్యం లేదని, ఎస్సీల్లో 60 ఉప కులాలు ఉంటే 58 ఉపకులాలకు ప్రాతినిధ్యం ఇవ్వక పోవడం సామాజిక న్యాయమా అని నిలదీశారు. రాష్ట్రంలోని బీసీల్లో 140 ఉప కులాలు ఉంటే 130 కులాలకు ప్రాతినిధ్యం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కందిరీగ తుట్టెను కదిలించారని, తనకు తాను సెల్ఫ్‌గోల్‌ కొట్టుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే వైసీపీలో అసమ్మతి మొదలై సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టే స్థాయికి చేరిందని, అసమ్మతి వాయుగుండం తీరం దాటి సునామీగా మారక తప్పదని తులసిరెడ్డి హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement