అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే నెల 3, 4 తేదీల్లో విశాఖ కేంద్రంగా ప్రభుత్వం నిర్వహించబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నారు. ఈమేరకు ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ నగరా ల్లో రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆకర్షించే ప్రయత్నాలు పూర్తిచేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించి తన బృందా న్ని సిద్ధం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు తాను కేవలం ఫోన్ కాల్ దూరంలో ఉన్నాని ముఖ్యమంత్రి జగన్ తెలిసేలా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న రాజకీయ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థిత్లో లేరని ఢంకా భజాయించి చెబుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు తాను అధికారంలో ఉండగా చెప్పిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని, ఫలితంగా ఆయన ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారని చెప్పుకొస్తున్నారు. చెప్పాడంటే..చేస్తాడంతే అనే నమ్మకాన్ని తాను ప్రజల్లో చూరగొన్నానని, దానిని మరింతగా ఇనుమడింపజేసుకుంటూ తాను ముందుకెళ్తానని అంటున్నారు. ప్రజల్లో తనపట్ల బలమైన విశ్వాసం ఉందికనుకనే తాను ఎటువంటి ప్రాచారాలు, హంగు, హార్బాటాలకు వెళ్లకుండా ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొస్తున్నానని పేర్కొంటున్నారు. రాజకీయ సుస్థిరతతో పాటు- బలమైన పాలన కూడా పెట్టు-బడిదారులకు అందిస్తున్నామని ఆయన చాటిచెప్పబోతున్నారు. గత కొంతకాలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, వరుసగా మూడు సంవత్సరాల నుండి పెట్టు-బడులను ఆకర్షించడంలో రాష్ట్రం విజయం సాధించిన సంగతిని ఆయన గుర్తుచేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు అందించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈర్యాంకింగ్స్ ఉన్నాయన్న సంగతిని మనం మర్చిపోకూడదని సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు చెబుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సగటు ప్రజల జీవన ప్రమణాలు దెబ్బతినకుండా డీబీటీ ద్వారా నగదు బదిలీ చేశామని గుర్తుచేస్తున్నారు.
వాటి ఉపాధి ప్రభుత్వ రంగం కంటే పెద్దదే :
ఎంఎస్‌ఎంఈలు నిజమైన ఉద్యోగాల సృష్టికర్తలని సీఎం జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. ఈరంగాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు. ప్రతి ఎంఎస్‌ఎంఈ కనీసం 10 ఉద్యోగాలను సృష్టిస్తుందని, వీటి ద్వారా సృష్టించబడే ఉపాధి ప్రభుత్వ రంగంలో కంటే పెద్దదని గుర్తించాలని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగా ఎంఎస్‌ఎంఈలు బలహీనపడ్డాయని, వాటికి ఇవ్వాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టి వాటిని ఆయన నిర్వీర్యం చేశారని గుర్తుచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈలకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలు అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న తమ ప్రభుత్వానికి భారంగా ఉన్నాయని భావించకుండా 2.5 లక్షల ఎంఎస్‌ఎంఈలకు అన్ని బకాయిలను క్లియర్ చేశామని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు.
ఆ పరిశ్రమల రాకే ఓ సంకేతం
బిర్లా, అదానీ, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టు-బడులు పెట్టాలని యోచిస్తున్నారని ఇంతకుముందు ఎప్పుడూ వినలేదని, కానీ ఇప్పుడు అది నిజమౌతోందన్న సంగతి తెలుసుకోవాలని, దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. ఈ దిగ్గజ కంపెనీలు తమ ప్లాంట్లను ఇక్కడ ప్రారంభించడమే ఏపీ విశ్వాసం పొందిందనడానికి నిదర్శనమని ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతన్నారు. వీటన్నింటివల్లే ఏపీ అత్యధిక జీడీపీ (11.43 శాతం) సాధించి దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచిందని ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఆయన చెబుతున్నారు.
ఇవే మణిహారాలుగా..
రాష్ట్రంలో 970 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని ఆయన నేతలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న ఆరు ఓడరేవులు మరియు రాబోయే నాలుగు ఓడరేవులతో కలిపి మొత్తం పది ఓడరేవులు రాష్ట్రంలో కొలువుదీరబోతున్నాయని చెబుతున్నారు. ఇక ఆరు విమానాశ్రయాలు మరియు రాష్ట్రం గుండా మూడు పారిశ్రామిక కారిడార్‌లను ఆయన ప్రస్తావిస్తూ జల, వాయు, రోడ్డు రవాణా కనెక్టవిటీతో ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా విరాజిల్లుతోందని నేతలకు హితబోధ చేస్తున్నారు. ఇక రాష్రంలో అమలవుతున్న పారిశ్రామిక పాలసీ ద్వారా పెట్టుబడుదారుల విలువైన సమయం వృథాను అరికట్టే విధంగా అత్యంత సరళతరంగా రూపొందించడం జరిగిందని వివరిస్తున్నారు. అన్ని అనుమతులు ఓకే ఒక్క క్లిక్‌తో వారికి అందుబాటులోకి తీసుకొచ్చిన అంశం ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు.
హంగు, హార్బాటాలేవీ లేకుండా :
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది ఒక నిశ్శబ్ద విప్లంగా ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించకూడదని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు ఈ పారిశ్రామిక పెట్టుబడల ఆకర్షణకు సంబంధించి ప్రచార ఆర్భాటాలు తప్ప సాధించిదేమీ లేదన్నది సీఎం జగన్ అభిప్రాయమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. కేవలం చేతల ద్వారా మాత్రమే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాని సీఎం జగన్ ధృఢ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారని వారంటున్నారు. సాధారణంగా రోడ్లు మరియు నీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడిదారులు చూస్తారని, అవన్నీ కూడా ఒక్క అడుగు దూరంలో వారికి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీనియర్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పెట్టుబడుదారులకు అందించే ప్రోత్సాహకాల్లో అన్ని రాష్ట్రాల మాదిరిగా కాకుండా మెరుగైన డెలివరీ మెకానిజమ్‌ను తాను అందించగలనని సీఎం హామీ ఇస్తున్నారని ఓ సీనియర్ వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే తాను కేవలం ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఉంటానన్న హామీని కూడా సీఎం ఇస్తున్నారని చెప్పారు.