Saturday, November 23, 2024

Delhi | మోదీ సర్కారుకు జగన్ సరెండర్ : ఏపీ కాంగ్రెస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మోదీ సర్కారుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయ్యారని కాంగ్రెస్ ఎంపీ, ఏపీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 33 నిముషాల ప్రసంగంలో 30 నిముషాల పాటు కాంగ్రెస్‌ను దూషించడానికే సరిపోయిందని అన్నారు. అలాగే బీజేపీని పొగుడుతూ మాట్లాడ్డం వారి మధ్య బంధాన్ని తెలియజేస్తోందని తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని, అందుకే ఇలా విరుచుకుపడుతున్నారని సూత్రీకరించారు. తాను ప్రత్యేక హోదా గురించి పనికిమాలిన ప్రసంగాలు చేస్తున్నానని విజయసాయిరెడ్డి మాట్లాడారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశానని మాణిక్కం టాగోర్ చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ప్రచురించిందని గుర్తుచేశారు. ఆ హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, విభజన సందర్భంగా ప్రత్యేక హోదా హామీని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చారని తెలిపారు.

కానీ ఆ తరువాత వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదని, దానిక్కూడా కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి అడగలేకపోతున్నామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారని, కానీ 25 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అని ప్రశ్నించారు. ఆ ప్రసంగాన్ని మీడియా కెమేరాలకు చూపించారు.

జమ్మూకాశ్మీర్ విభజన, సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ), 2021లో చేసిన బిల్లులన్నింటికీ మద్దతు ఇచ్చారని టాగోర్ గుర్తుచేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మొత్తం మద్దతు బీజేపీ అభ్యర్థికే ఇచ్చారని అన్నారు. అలాగే ఢిల్లీ పాలనా అధికారాల బిల్లుకు కూడా వైఎస్సార్సీపీ మద్దతిచ్చిందని, మొత్తంగా మోదీ ప్రభుత్వం చేసిన 15 బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో మద్దతిచ్చి, బయట భారత్ బంద్‌కు మద్దతిచ్చారని తెలిపారు.

జగన్ బీజేపీతో ఉన్నారని, బీజేపీకి నమ్మకమైన వ్యక్తి జగన్ అని అన్నారు. బీజేపీకి జగన్ ATM లాంటి వాడని, మోడీకి జగన్ సరెండర్ కావడం వెనుక ముఖ్యపాత్ర విజయసాయిరెడ్డిదేనని మాణిక్కం టాగోర్ ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి బయట పడటానికి బీజేపీ చెంత చేరారని విమర్శించారు. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడకూడదని, అలా మాట్లాడితే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సి ఉంటుందని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు చేసానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement