విశాఖపట్నం : విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు అని, ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను ఉప్పొంగేలా చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 రెండోరోజు సదస్సులో ముగింపు ఉపన్యాసంలో సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందన్నారు. మీతో మా బంధం చాలా అమూల్యమైనదన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుందన్నారు. అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ శర వేగంతో తిరిగి పుంజుకుందన్నారు. కోవిడ్ మహమ్మారి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా అనేక రంగాలకు మా ప్రభుత్వం సమయాను కూలంగా ప్రోత్సాహం ఇచ్చింది. సుపరిపాలన, సమర్థవంతమైన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలవడమే కాకుండా ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచింది. అంతేకాకుండా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూసిందన్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారస్తులకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి కోవిడ్ సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేశామన్నారు. అత్యంత కీలక సమయంలో ఈ సదస్సును నిర్వహించామన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం మరిన్ని అవకాశాలు అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలతో మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించామన్నారు. సదస్సులో భాగంగా మేం పెట్టిన ఎగ్జిబిషన్ ఎరీనా ప్రత్యేకంగా అందర్నీ ఆకట్టుకుందన్నారు. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ఒన్ డిస్ట్రిక్ట్ – ఒన్ ప్రొడక్ట్) థీమ్ ఆధారంగా 137 స్టాళ్లను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశామన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా ఈ రెండు రోజుల పాటు కేంద్రం మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్య వేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశాలన్ని అత్యంత ఫలప్రదంగా సాగాయని, పెట్టబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉంది.
15 సెషన్లు- 100 మంది వక్తలు..
ఈ సదస్సులో భాగంగా వివిధ రంగాలపై 15 సెషన్లు నిర్వహించాం. 100 మందికిపైగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను కున్న బలాలేంటో చెప్పారు. ఆటోమైబైల్– ఈవీ సెక్టార్, హెల్తకేర్– మెడికల్ ఎక్విప్‌మెంట్, రెన్యువబుల్‌ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మెనియా, అగ్రి ప్రాససింగ్ మరియూ టూరిజం తదితర రంగాలు ఇందులో ఉన్నాయి.
మీ నమ్మకానికి ధన్యవాదాలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచినందుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఎంఓయూలు కుదుర్చుకున్న వారంతా వీలైనంత త్వరగా తమ పెట్టబడులతో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుతున్నా అన్నారు. దీనికోసం అన్నిరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. మీ వ్యాపారాలు ప్రారంభించడానికి, పరిశ్రమలు పెట్టేందుకు వేగవంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సదుపాయాలను కల్పిస్తుందన్నారు. వీటిని సాకారం చేసేందుకు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాల అధికారులు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు దిశగా కృషి చేస్తుంది. మీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వాటిని ఈ కమిటీ పరిష్కరిస్తూ.. ఈ పెట్టుబడులు ఫలప్రదమయ్యేలా ఆటంకాలు లేకుండా చూస్తుందన్నారు.