జమ్ముకశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు..
టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూల్గాంలో సెర్చింగ్ నిర్వహించారు జవాన్లు. అయితే.. వారిపై ఒక్కసారిగా ఫైరింగ్ జరిపారు ఉగ్రవాదులు.. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాల కాల్పులు జరిపి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అక్కడ ఇంకా ముష్కరమూకలు ఉన్నాయనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
బుధవారం రాత్రి జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు.. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కుల్గామ్‌లోని కాదర్‌లో ప్రారంభించారు. అప్రమత్తమైన దళాలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి.. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. వారి కుట్రలను దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి” అని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నట్లు ఎఎన్ఐ తెలిపింది..