Friday, November 22, 2024

నోటిఫికేషన్‌లకు వేళాయె !

ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారు. అలాంటి సమయంలోనే ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ శాఖలలో ఖాళీల సంఖ్యను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలలో ప్రకటించారు. భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలను కూడా ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖలలో కలిపి దాదాపు లక్ష పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఒక ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడం మొదటి సారి. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సర్కారు ముందుకు రావడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం భర్తీ చేసేందుకు సిద్ధమైన ఉద్యోగాలలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత యువకులు కోరిన పోస్టులు ఉండడం గమనార్హం. పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులతో పాటు ఉపాధ్యాయ పోస్టులు భారీగా ఉన్నాయి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నిరుద్యోగ యువత సాధన ప్రారంభించింది. ప్రభుత్వ ప్రకటన వచ్చిన నాటి నుంచే నిరుద్యోగులు తీవ్ర సాధనలో మునిగిపోయారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిరుద్యోగుల సందడి కనిపిస్తోంది. కోచింగ్‌ సెంట్లలో భారీగా నిరుద్యోగులు చేసి శిక్షణ పొందుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంత యువత కొరకు ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ ఉచిత కోచింగ్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలో ఉచిత కోచింగ్‌ను ప్రారంభిస్తామని పోలీసు శాఖ ప్రకటించింది.

పోలీసు శాఖలో ఒకేసారి 18 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో గ్రామీణ యువత ఈ పోస్టులపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మొదటగా పోలీసు శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే వారం రోజులలో పోలీసు శాఖ నుంచి ఖాళీల భర్తీకి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు జిల్లాలో పోలీసు శాఖ నుంచి ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలో ఉచిత కోచింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పోలీసు శాఖ ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్దమైంది. జిల్లా కేంద్రంలో మరింత అధికంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఏర్పాట్లు ప్రారంభించారు. పోలీసు శాఖ ఇచ్చే ఉచిత కోచింగ్‌కు భారీగా స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో కూడా పోలీసు శాఖ ఇచ్చిన కోచింగ్‌లో శిక్షణ పొందిన నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు వచ్చాయి. ఈసారి కూడా యువత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement