Tuesday, November 26, 2024

ప్రవేశ పరీక్షలకు వేళాయే! 30, 31 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌.. ఆగస్టులో పీజీ ఈసెట్‌, లాసెట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు ఈనెల, వచ్చే నెలల్లో జరగనున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇటీవల వాయిదా పడిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌(ఏఎం) ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 30, 31వ తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈనెల 13న జరగాల్సిన ఈసెట్‌, 14, 15 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ (స్టీమ్‌) పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. రేప‌టితో (బుదవారం) ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ముగుస్తుండటంతో ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌(ఏఎం), ఇక‌ ఆగస్టు 1న టీఎస్‌ ఈసెట్‌ పరీక్షలను అధికారులు రీషెడ్యూల్‌ చేశారు. ఆగస్టు 2 నుండి 5వ తేదీ వరకు టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్ష జరగనుంది. 30, 31వ తేదీల్లో జరిగే ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్‌లలో జరుగుతాయి. టీఎస్‌ ఈ సెట్‌ పరీక్ష కూడా రెండు సెషన్‌లలోనే జరగనుంది. పీజీఈసెట్‌ పరీక్షలు మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి.

అదేవిధంగా ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం టీఎస్‌ లాసెట్‌ (3ఏళ్ల కోర్సు) ప్రవేశ పరీక్ష ఈనెల 21న రెండు సెషన్‌లలో జరగనుంది. అలాగే ఈనెల 22న లాసెట్‌ (5ఏళ్ల కోర్సు), పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆయా వెబ్‌సైట్‌ల నుంచి సంబంధిత అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 18వ తేదీ నుంచి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారంతో ఎంసెట్‌ పరీక్షలు ముగియనున్నాయి. మొదటి రోజు ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా హాజరైన వారికి మధ్యాహ్నం సెషన్‌లో రాయించినట్లు తెలిసింది. కేటాయించిన రోజు రాయలేకపోతే మరో రోజు రాసేవిధంగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి ఉండకుండా అభ్యర్థులు జరగబోయే పరీక్షలకు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. వర్షాల వల్ల తెలంగాణలో పలు సెంటర్లలో ఎంసెట్‌ పరీక్షలు ఆలస్యమైనట్లు తెలిసింది. అలాంటి వారికి వేరే సెషన్‌లో రాసేందుకు అవకాశమిచ్చినట్లు సమాచారం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ఈనెల 18 నుంచి 20 వరకు జరుగుతున్నాయి. మంగళవారం రోజు జరిగిన ఇంజనీరింగ్‌ పరీక్షకు రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 90.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 58,376 మంది రిజిస్టర్‌ చేసుకోగా 52,796 మంది పరీక్షకు హాజరైనట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొ.గోవర్థన్‌ తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనూ మరికొన్ని ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement