Wednesday, January 8, 2025

CEC | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మోగిన న‌గ‌రా..

  • షెడ్యూల్ విడుద‌ల చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం
  • మొత్తం 70స్థానాల‌కు ఏక‌కాలంలో పోలింగ్
  • 10న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్.. ఫిబ్ర‌వ‌రి 5న పోలింగ్
  • ఫిబ్ర‌వ‌రి 8న ఎన్నిక‌ల ఫలితాలు
  • ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న ఒక కోటి 55ల‌క్ష‌ల ఓట‌ర్లు


ఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17న నామినేషన్లకు చివరి తేదీ. 13000 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు పేర్కొంది.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70స్థానాలు ఉండగా, అందులో 58జనరల్ స్థానాలు ఉన్నాయి. మరో 12 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 83.49 లక్షలు, మహిళలు 71. 74 లక్షలు ఉండగా.. యువ ఓటర్లు 25.89వేల మంది ఉండగా.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 2.08 లక్షలు, వికలాంగులు 79, 436 మంది, వయోవృద్ధులు 830, ట్రాన్స్ జెండర్స్ 1261 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పష్టత..
ఈ సందర్భంగా ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితాలో అవకతవకలు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఈసీ స్పష్టతనిచ్చారు. “ఓటింగ్లో మనం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. త్వరలోనే దేశంలో ఓటర్ల సంఖ్య 100కోట్లను దాటనుంది. అయితే, ఎన్నికల ప్రక్రియపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఓటరు జాబితాను సిద్ధం చేసే ప్రతి దశలో రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇది పూర్తిగా పారదర్శకమైన ప్రక్రియ. ఓటరు జాబితాలో పేర్ల చేరిక, తొలగింపులకు సంబంధించి విధివిధానాలను పాటిస్తున్నాం. ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదు” అని రాజీవ్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం లేదని కోర్టులు ఇప్పటికే 42సార్లు తీర్పులు చెప్పాయని సీఈసీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ట్యాంపరింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతంలో భారీ మార్పులు ఉంటున్నాయంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పోలింగ్ శాతాన్ని ఎవరూ మార్చలేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement