రాజ్‌కోట్ వేదికగా మొదలైన మూడో టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే టీమ్ఇండియా యువ ఆటగాడిని దురదృష్టం వెంటాడింది. డెబ్యూ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాది సెంచరీ వైపు దూసుకెళ్తున్న సర్ఫరాజ్ ఖాన్.. రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. 66 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్‌తో 62 పరుగులు చేసి మంచి ఊపుమీదున్న సమయంలో దురదృష్ట వశాత్తు రనౌట్ అయ్యాడు. అయితే.. రనౌట్‌లో అతడి పొరబాటు ఏమీ లేదు. ఆ రనౌట్‌కి కారణం నేనే అంటూ కొద్ది సేపటి క్రితం జడేజా సోషల్ మీడియా వేదికగా సర్ఫరాజ్ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. సర్ఫరాజ్ ఖాన్ తన డెబ్యూ మ్యాచ్‌లో చాలా బాగా ఆడినట్టు పేర్కొన్నాడు.
జడేజాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు సర్ఫరాజ్ ఖాన్. 82వ ఓవర్‌లో అండర్సన్ బౌలింగ్‌లో జడేజా షాట్ ఆడాడు. పరుగు తీసి సెంచరీ పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న జడేజా.. పరుగు కోసం పిలవడంతో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ ముందుకు వెళ్లాడు. అయితే, బాల్‌ను ఫీల్డర్ అందుకోవడంతో జడేజా వెనక్కి తగ్గాడు. అప్పటికే క్రీజు నుంచి చాలా దూరం వెళ్లిన సర్ఫరాజ్ ఖాన్ వెనక్కి వచ్చేలోపే మార్క్‌వుడ్ వికెట్లను పడగొట్టాడు. దీంతో సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ముగిసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ కావడంతో.. ఆరో స్థానంలో బరిలోకి దిగిన యంగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్ లో అర్ధశతకంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్ యాదవ్ ఉన్నారు.