న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో పార్టీ బలోపేతానికి భారతీయ జనతా పార్టీ చర్యలు చేపడుతోందని. ఇందులో భాగంగా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఫోన్ చేసి ఢిల్లీ రావాల్సిందిగా కోరారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం ఢిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సాయంత్రం 6 గంటలకు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నడ్డా తెలంగాణ రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు.
పార్టీని ఎలా బలోపేతం చేయాలని నడ్డా తమను అడగ్గా, అందుకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశామన్నారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా, ఎటువంటి సంకోచం లేకుండా అన్ని పరిస్థితులను వివరించామని తెలిపారు. బీజేపీతోనే కేసీఆర్‌ను ఓడించగలమని ప్రజలు నమ్ముతున్నారని నడ్డా, అమిత్ షాకు వివరించామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించామన్నారు.
మోదీ, అమిత్ షా, నడ్డా నాయకత్వం పట్ల తమకు నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కీలక నిర్ణయాలు తీసుకుంటేనే ముందుకు వెళ్తామని నడ్డాకు చెప్పామని ఆయన వివరించారు. తెలంగాణలో విజయం కోసం అమిత్ షా పట్టుదలగా ఉన్నారని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తమ లక్ష్యం కుటుంబ పాలన అంతం కావడమేనని తేల్చి చెప్పారు. తమకు వ్యక్తిగతంగా ఏ పదవులు అవసరం లేదని, కోరుకోలేదని ఆయన నొక్కి చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడం గురించే ప్రధానంగా చర్చించామని, తమ సూచనలను అమిత్ షా, నడ్డా శ్రద్ధగా విన్నారని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.