Tuesday, November 26, 2024

పది రోజులపాటు ఎండలే ఎండలు.. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పెరిగే అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగణాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో వచ్చే పది రోజులు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో, అరేబియా సముద్రంపై గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడమే కారణమని వాతావారణ కేంద్రం చెబుతోంది.

ఈ కారణంగా రాష్ట్రంలో వచ్చే పది రోజులు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉదయం, రాత్రి సమయాల్లో 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. అదే మధ్యాహ్నసమయంలో 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అదే సమయంలో మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం అయింది. సోమవారం నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని రామగుండం వరకు తిరోగమించాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ నుంచి పూర్తిగా తిరోగమించనున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్న ప్రభావంతో అక్టోబర్‌ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 9 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement