Tuesday, November 26, 2024

నియోజకవర్గాలలోనూ ఐటి టవర్స్ – ఎన్నికల వేళ పెరుగుతున్న డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, నేతల నుంచి ఎక్కువవుతోంది. ఇప్పటికిప్పుడు ఐటీ టవర్‌ ఏర్పాటై ప్రారంభమవకున్నా కనీసం శంకుస్థాపన చేస్తే చాలన్న భావనతో ఎక్కువమంది నేతలున్నట్లు తెలుస్తోంది. ఐటీ టవర్ల ఏర్పాటుతో నియోజకవర్గాల్లోని యువతలో పాజిటివిటీ పెరుగుతందని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని పలు ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఐటీ టవర్లలో ఇప్పటికే కంపెనీలు వచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తుండడంతో ఈ టవర్లకు క్రేజ్‌ పెరిగింది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ లాంటి పట్టణాల్లో ఇప్పటికే ఐటీ టవర్లు ప్రారంభమై కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు ఐటీ ఉద్యోగం కోసం హైదరాబాద్‌ రాకుండా స్థానికంగానే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఎంఎన్‌సీ ఐటీ కంపెనీలు కూడా ద్వితీయశ్రేణి నగరాల్లో తమ కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి.

దీంతో చిన్న పట్టణాల్లో అన్ని మౌలిక వసతులతో కూడిన ఐటీ టవర్ల అవసరం ఏర్పడింది. ఈ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తే కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు పెద్దగా సమయం తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లిd బడ్జెట్‌ సమావేశాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేయాలని అసెంబ్లిdలోనే వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రాలిచ్చారు. ఐటీ టవర్లు ఏర్పాటైతే తమ ప్రాంత యువతకు ఉద్యోగాలొస్తాయని వివరించారు. ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సహా ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా ఈ మేరకు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కేవలం యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఐటీ టవర్‌ ఏర్పాటు వల్ల సదరు ప్రాంతంలో రియల్‌ఎస్టేట్‌ వృద్ధి కూడా వేగంగా జరుగుతుందని, దీంతో నియోజకవర్గం అభివృద్ధి చెందిన ప్రాంతాల జాబితాలో చేరుతుందని ఆయా నేతలు పేర్కొంటున్నారు. ఇందుకే ఐటీ టవర్ల ఏర్పాటుకు డిమాండ్‌ ఎక్కువైందని వారు చెబుతున్నారు.

త్వరలో మరిన్ని ప్రాంతాల్లో ఐటీ టవర్ల మంజూరు…
ఇప్పటికే ఐటీ టవర్లు మంజూరు చేసిన ప్రాంతాలు కాకుండా త్వరలో మరిన్ని చిన్న పట్టణాల్లో ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నేతలు అడుగుతున్నారని కాకుండా ఫీజబులిటీ, స్కేల్‌ ఆధారంగానే టవర్ల మంజూరు జరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. టవర్లు మంజూరు చేసిన ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ స్వయంగా వెళ్లి శంకుస్థాపనలు చేస్తారని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు సత్వరమే ఉద్యోగాలు లభించేందుకు ఉత్పత్తి రంగంతో పోలిస్తే ఐటీ రంగమే అనుకూలంగా ఉందని అధికారులు వివరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement