Tuesday, November 26, 2024

టార్గెట్ ప్రతిపక్షాలు.. రూ.8 కోట్లు స్వాధీనం

తమిళనాడులో మరికొన్నిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు దూకుడు పెంచారు. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ. 8 కోట్ల నగదు పట్టుబడింది. బీజేపీ తమిళనాడు చీఫ్ ఎల్.మురుగన్ తిరుప్పూరు జిల్లా ధారాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ప్రత్యర్థుల బంధువుల ఇళ్లపై ఆదాయపన్నుశాఖ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఇక్కడ ఎండీఎంకే నేత కవిన్ నాగరాజ్, ఆయన సోదరుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) కోశాధికారి చంద్రశేఖర్, డీఎంకే నేత ధనశేఖర్ ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి వరకు సోదాలు జరగ్గా నిన్న చంద్రశేఖర్ ఇంట్లో మళ్లీ తనిఖీలు నిర్వహించారు.

కాగా ఐటీ శాఖ అధికారుల దాడులపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. ప్రత్యర్థులను భయపెట్టేందుకే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. చంద్రశేఖర్ ఓ వ్యాపారవేత్త అని, ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల ఆరోపణలపై స్పందించిన మురుగన్.. ఐటీ దాడులకు, బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement